Operation Sindoor : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం లో టూరిస్టులపై ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ పాక్ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగింది. బుధవారం తెల్లవారు జామున పాక్‌పై భారత్ విరుచుకుపడింది. అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకున్న వారిని వదలమని ప్రధాని మోదీ చెప్పినట్లే అఫరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మొత్తంగా తొమ్మిది ప్రాంతాల్లో దాడి చేసింది భారత్. ఈ ఆఫరేషన్‌లో రాఫెల్, SCALP క్షిపణులు కీలకంగా మారాయి. పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో రాఫెల్, SCALP క్షిపణులు విధ్వంసం సృష్టించాయి.
పాకిస్తాన్‌పై జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో భారత అమ్ముల పొదిలోని రాఫెల్ తో పాటు స్కాల్ప్ క్షిపణులు కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇంతకు స్కాల్ప్ అంటే ఏంటో తెలుసా? స్కాల్ప్ (SALP) అంటే ఒక డీప్ స్ట్రైక్ క్రూజ్ క్షిపణి. ఇది గాలిలో నుంచి భూమిపై దాడులు చేస్తుంది. శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోయి అక్కడి లక్ష్యాన్ని ఛేదించగల అద్భుతమైన క్షిపణి ఇది. అంతేకాదు. ఆకాశంలో ఉంటూ ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేసే సామర్థ్యం కూడా స్కాల్స్‌కు ఉంది. ఇది మొత్తంగా తను ఉన్న చోటు నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించి శత్రువును నాశనం చేసే సమర్థత కలిగి ఉంది.
ఇక ఈ SCALP క్షిపణులు దాడి చేస్తే ఆ ప్రాంతంలో 30 మీటర్ల లోతు వరకు చొచ్చుకొని పోగల సామర్థ్యం వీటి సొంతం. 1300 కిలోల బరువుతో 450 కిలోల పేలోడ్ కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఐదు మీటర్ల కంటే పొడవు, 63 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగి ఉంటుంది. అందుకే ఆఫరేషన్ సింధూర్ లో రాఫెల్, స్కాల్ప్ రెండు కీలక భూమిక పోషించాయి. ముఖ్యంగా అత్యంత సంక్లిష్టమైన ఈ ఆపరేషన్స్ లో లష్కరే తోయిబా జైషే మహమ్మద్ ప్రధానా స్థావరాలపై దాడి చేయడంలో ఈ రెండు కీలకంగా మారాయి. ఈ రెండు బుధవారం రాత్రి పాక్ కు నిద్ర లేకుండా చేశాయనడంలో సందేహం లేదు.
పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ రహస్య ఆఫరేషన్ పాక్ కు గట్టి బుద్ది చెప్పిందనే చెప్పాలి.