Save Aravalli: ఎడారిగా మారనున్న ఇండియా.. ‘సేవ్ ఆరావళి’ వెనుక అసలు కథ ఇదే!

దేశ చరిత్ర, భౌగోళిక శాస్త్రంలో కీలకమైన ఆరావళి పర్వత శ్రేణి హిమాలయాలకంటే కూడా పురాతణమైంది. 3.2 బిలియన్ సంవత్సరాల క్రితం ఇవి ఆవిర్భవించాయి. ఇప్పుడు అవి డేంజర్ జోన్‌లో ఉన్నాయని సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి అనే హ్యాటాగ్ వైరల్ అవుతోంది.

New Update
save Aravalli

భారత్‌లోని ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వతాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన నెలకొంది. దేశంలో పురాతనమైన ఆరావళి పర్వతాలు గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి భారత్‌ రక్షణగా పెట్టని గోడలా ఉన్నాయి. ఆరావళి పర్వత శ్రేణి లేకుంటే ఉత్తర భారతదేశం ఏడారిలా మారిపోయి ఉండేది. హిమాలయాలకంటే కూడా పురాతణమైంది ఆరావళి పర్వత శ్రేణి. 3.2 బిలియన్ సంవత్సరాల క్రితం ఇవి ఆవిర్భవించాయి. ఇప్పుడు అవి డేంజర్ జోన్‌లో ఉన్నాయని సోషల్ మీడియాలో సేవ్ ఆరావళి అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది. రాజస్థాన్ లక్షలాది మంది ప్రజలు స్వచ్చందంగా ఆందోళన చేస్తున్నారు. ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తన వాయిస్ ను గట్టిగా వినిపిస్తోంది. ఆరావళి పర్వాతాల్లో ఏం జరుగుతోంది.. ఎందుకీ ఉద్యమం? భారత్ భవిష్యత్‌కు ఆరావళి పర్వత శ్రేణి ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం..

#సేవ్ ఆరావళి

ఇటీవల ఆరావళి పర్వతాల్లో తవ్వకాలపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2025 నవంబర్ 20న కేంద్ర ప్రభుత్వం సిఫార్సు ఆధారంగా సుప్రీంకోర్టు.. ఆరావళి పర్వతాలకు కొత్త నిర్వచనాన్ని అంగీకరించింది. 100 మీటర్ల లోపు ఉన్న వాటిని ఆరావళి పర్వతాలుగా చెప్పలేమని కేంద్రం ఇచ్చిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆమోదించింది. దీంతో సుప్రీంకోర్టు తమ సిఫార్సును అంగీకరించింది కాబట్టి.. తాము మైనింగ్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వొచ్చు అని కేంద్రం అంటోంది. అయితే సుప్రీంకోర్టు తన తీర్పులో ఆరావళి పర్వత శ్రేణుల స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదని కూడా చెప్పింది. 

సుప్రీంకోర్టు తీర్పు క్రమంలో ఆరావళి పర్వతాలను కాపాడే ఉద్యమం మరింత ఉదృతం అయింది. అలాగే రాజస్థాన్‌లోని లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు ఆరావళి పర్వతాలను కాపాడాలంటూ సోషల్ మీడియాలో పోరాటం చేస్తు్న్నారు నెటిజన్లు. సేవ్ ఆరావళి అంటూ భారీ ఎత్తున గళమెత్తుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఆరావళి పర్వతాల్లో 100 మీటర్ల కంటే (328 అడుగులు) తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ జరుపుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్‌, పర్యావరణ వేత్తలకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్వతాల్ని కాపాడటం మానేసి, మైనింగ్‌కి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్, అక్రమ కట్టడాలతో పర్యావరణం తీవ్రస్థాయిలో దెబ్బతింటుంది.. మైనింగ్‌తో వచ్చే ధూళితో ఎడారి రాష్ట్ర రాజస్థాన్ దుర్భర పరిస్థితులను ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు పర్యావరణ వేత్తలు. దేశవాప్యంగా విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. విపక్షాలు సైతం ఆరావళి విధ్వంసాన్ని ఆపాలంటూ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఆరావళి పర్వతాల్లో అరుదైన, గొప్ప ఖనిజాలు ఉన్నాయి. ఇప్పటికే మైనింగ్ చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాదు.. వన్యప్రాణులకు కూడా దిక్కు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఇది మరణ శాసనమే అని కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కేంద్రాన్ని హెచ్చరించారు.

కేంద్రం వాదన.. 

ఆరావళి పర్వతాలలో గనుల తవ్వకాల కోసం వాటి నిర్వచనాన్ని మార్చారని వస్తున్న ఆరోపణల పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆరావళి విస్తీర్ణంలో 90 శాతానికి పైగా రక్షిత ప్రాంతంగానే ఉంటుందని పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్పష్టం చేశారు. మొత్తం 1.44 లక్షల చ.కి.మీ విస్తీర్ణంలో కేవలం 0.19% పరిధిలోనే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. ఆరావళి పర్వతాల మైనింగ్‌పై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యంత కఠినమైన నిబంధనలు ఉంటాయని, కొత్తగా ఎక్కడ పడితే అక్కడ మైనింగ్ లీజులు ఇవ్వబోమని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రాంతంలో మైనింగ్‌పై పూర్తి నిషేధం కొనసాగుతుందని చెప్పారు.

ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్:ఎడారి విస్తరించకుండా పర్వతాల చుట్టూ 5 కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని పెంచే "గ్రీన్ వాల్" ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందుకోసం నర్సరీలను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఆరావళి అంతరిస్తే ప్రమాదాలివే..

థార్ ఎడారి విస్తరణ: ఆరావళి పర్వతాలు పశ్చిమ రాజస్థాన్‌లోని థార్ ఎడారి గాలిని, ఇసుకను తూర్పు వైపుకు (ఢిల్లీ, హర్యానా, పంజాబ్ వైపు) రాకుండా ఒక సహజ గోడలా అడ్డుకుంటున్నాయి. ఇవి లేకపోతే ఉత్తర భారతదేశం మొత్తం ఇసుక మేటలతో ఎడారిగా మారే ప్రమాదం ఉంది.

వర్షపాతం తగ్గడం: నైరుతి రుతుపవనాలు వీచేటప్పుడు, ఈ పర్వతాలు తేమతో కూడిన గాలిని అడ్డుకొని గంగా మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురిపించడానికి పరోక్షంగా సహాయపడతాయి. ఇవి లేకపోతే మేఘాలు ఆగకుండా వెళ్ళిపోతాయి, దీనివల్ల వర్షాలు తగ్గి వ్యవసాయం దెబ్బతింటుంది.

పెరిగే వేడి : ఎడారి నుంచి వచ్చే వేడి గాలులను ఆరావళి అడ్డుకుంటుంది. ఇవి లేకపోతే ఉత్తర భారత్‌లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయి, నివసించడానికి వీలులేని పరిస్థితులు ఏర్పడతాయి.

గంగా-యమునా మైదానాల నాశనం: ప్రస్తుతం ఆరావళి పర్వతాలు గంగా నది పరివాహక ప్రాంతానికి రక్షణగా ఉన్నాయి. ఇసుక తుఫానుల వల్ల ఈ సారవంతమైన మైదానాలు సాగుకు పనికిరాకుండా పోతాయి.

Advertisment
తాజా కథనాలు