/rtv/media/media_files/2025/05/21/A2zjNxOUmLwJaHuOqBbb.jpeg)
నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో రాహుల్, సోనియాలు నేరానికి పాల్పడి రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని బుధవారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది. నేరాల ద్వారా వచ్చిన డబ్బును సంపాదించి, దాచుకున్నారని ఈడీ తీవ్రమైన ఆరోపణులు చేస్తోంది. కాగా మే 2న, కోర్టు గాంధీ కుటుంబంతో పాటు సుమన్ దూబే, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్, సునీల్ భండారీలకు నోటీసులు జారీ చేసింది. కాగా నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో వీరిని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించింది. విదేశీ నిధులతో ఈ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. అయితే సీబీఐ విచారణను మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కంటిన్యూ చేస్తోంది.
నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏమిటి?
నేషనల్ హెరాల్డ్ కేసు ఒక వార్తాపత్రికకు సంబంధించిన కేసు. ఈ వార్తాపత్రికను 1938లో భారత మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారు. ఈ పత్రికను ప్రచురించే ఏజేఎల్ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. AJL గతంలో మరో రెండు వార్తాపత్రికలను ప్రచురించేది. ఈ వార్తాపత్రికలు హిందీలో నవజీవన్, ఉర్దూలో క్వామీ అవాజ్ పేర్లతో ప్రచురితం అయ్యేది. ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి 2008లో మూసివేయాల్సి వచ్చింది. ఆ కంపెనీకి రూ. 90 కోట్ల అప్పు ఉంది. దీని తర్వాత వివాదం మొదలైంది.
యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎంపీలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 38 శాతం చొప్పున వాటా ఉంది. దీని వలన వారు మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్) ద్వారా ఏజేఎల్‌కు చెందిన రూ.2,000 కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.50 లక్షలకు సోనియా, రాహుల్ గాంధీ కొనుగోలు చేశారని ఈడీ అభియోగాలు మోపింది. ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్‌లో భాగమన్నది ఈడీ ప్రధానంగా ఆరోపిస్తుంది.