ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన ఈ నగర పాలక సంస్థ పీఠాన్ని BJP కైవసం చేసుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత శివసేన పట్టు తప్పి, ముంబై మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది.

New Update
mumbai

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దేశంలోనే అత్యంత సంపన్నమైన ఈ నగర పాలక సంస్థ పీఠాన్ని BJP కైవసం చేసుకుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత శివసేన పట్టు తప్పి, ముంబై మేయర్ పీఠంపై బీజేపీ జెండా ఎగిరింది. ఇటీవల జరిగిన బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘనవిజయం సాధించినప్పటికీ, మేయర్ ఎంపికపై బీజేపీ మరియు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య గత నెల రోజులుగా తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు మేయర్ పదవిని బీజేపీ దక్కించుకోగా, డిప్యూటీ మేయర్ పదవి శివసేనకు కేటాయించారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అమిత్ సతం శనివారం అధికారికంగా ప్రకటన చేశారు. మేయర్‌గా బీజేపీ సీనియర్ నేత రీతూ తాన్డే, డిప్యూటీ మేయర్‌గా శివసేన కౌన్సిలర్ సంజయ్ ఘడి ఎన్నికయ్యారు.

ఎవరీ రీతూ తాన్డే?

రీతూ తాన్డే బీజేపీలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకురాలు. ఆమె గతంలో మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం గహత్కోపర్ నియోజకవర్గం (వార్డు 132) నుంచి విజయం సాధించారు. గతంలో బీఎంసీ విద్యా కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో, నగర అభివృద్ధికి ఆమె సరైన అభ్యర్థి అని పార్టీ హైకమాండ్ భావించింది. మేయర్ పదవి మహిళా (జనరల్) కేటగిరీకి రిజర్వ్ కావడంతో ఆమె అభ్యర్థిత్వానికి లైన్ క్లియర్ అయ్యింది.

సంజయ్ ఘడి (శివసేన - షిండే వర్గం). సంజయ్ ఘడి దహిసర్ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అయితే, శివసేన తన వర్గంలోని మరికొందరు నేతలకు అవకాశం ఇచ్చేందుకు వీలుగా డిప్యూటీ మేయర్ పదవీకాలాన్ని విభజించింది. సంజయ్ ఘడి ఈ పదవిలో 15 నెలల పాటు కొనసాగుతారు. మొత్తం 227 స్థానాలున్న బీఎంసీలో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, శివసేన (షిండే) 29 సీట్లు గెలుచుకుంది. వీరిద్దరి కలియికతో మేజిక్ ఫిగర్ (114) దాటి 118 మంది కౌన్సిలర్ల బలం కూటమికి దక్కింది. దశాబ్దాలుగా ముంబై మున్సిపాలిటీపై ఆధిపత్యం చెలాయించిన థాకరే వర్గానికి ఈ ఫలితాలు పెద్ద ఎదురుదెబ్బగా మారాయి. ఈ కొత్త నాయకత్వంతో ముంబై నగరాన్ని అవినీతి రహితంగా మార్చి, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు