Prashant Kishor : పాపం పీకే.. పీకీ పారేశారు..  ఎగ్జిట్ పోల్స్లో ఊడ్చేశారు!

బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తాడని భావించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలలు మరోసారి కల్లలయ్యేలా కనిపిస్తున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆయన జన్ సూరాజ్ పార్టీ ప్రయాణం.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో అడుగంటింది.

New Update
prashant

బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తాడని భావించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలలు మరోసారి కల్లలయ్యేలా కనిపిస్తున్నాయి. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆయన జన్ సూరాజ్ పార్టీ ప్రయాణం.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో అడుగంటింది. ఒకప్పుడు దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ స్ట్రాటజిస్ట్ గా పేరు తెచ్చుకున్న  ప్రశాంత్ కిషోర్... ఇప్పుడు తనదైన మార్పు కోసం సొంత బాట వేసుకున్నారు. అవినీతి రహిత, మెరుగైన బిహార్ అనే ఆశయంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి, యువతలో అపారమైన ఆశలను రేకెత్తించారు.

ఈసారి తామే ప్రత్యామ్నాయం అవుతామని,  రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతుందని ధీమాతో అడుగులు వేశారు. ఎన్నికల పోలింగ్ ముగియగానే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ మాత్రం పీకే ఆశలపై దారుణంగా  నీళ్లు చల్లాయి. బిహార్ ఓటర్లు మరోసారి ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు. మెజారిటీ సర్వేల అంచనా ప్రకారం..  పీకే పార్టీ జన్ సూరాజ్ కి దక్కేవి కేవలం ఒకటి లేదా రెండు సీట్లే. కొన్నిచోట్ల అసలు ఖాతా తెరవకపోవచ్చనే అంచనాలు వేశాయి. ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ ప్రస్థానంలో తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగి, తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

కానీ, ఆయన తన వ్యూహాలతో గెలిపించిన పార్టీల కంటే, సొంతంగా నిలబెట్టిన పార్టీకే అత్యంత దారుణమైన ఫలితాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. బిహార్ గాలి ఎన్డీఏ వైపు వీయడంతో పీకే పార్టీ  స్వప్నం తాత్కాలికంగానైనా నేలకే పరిమితమైందనేది తాజా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న వాస్తవం. అయితే తుది ఫలితాలు వెలువడటానికి ఇంకా సమయం ఉంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు తర్వాత అసలు వాస్తవం ఏమిటో తెలుస్తుంది. ఈ ఫలితంపై పీకే ఎలా స్పందిస్తారో, ఆయన తన జన్ సూరాజ్ ప్రయాణాన్ని మరెలా ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాలి. అయితే ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, అవసరమైతే తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా మళ్లీ ఎన్నికలకు వెళ్లడానికైనా సిద్ధమేనని, జన సూరాజ్ లక్ష్యానికి మరో ఐదేళ్లు కేటాయించగలనని ప్రశాంత్ కిషోర్ గతంలో ప్రకటించారు.

సర్వే సంస్థ : జన్ సూరాజ్ పార్టీ (JSP) సీట్లు

  • పీపుల్స్ పల్స్  :     0 – 5 సీట్లు
  • మాట్రిజ్  :     0 – 2 సీట్లు
  • డీవీ రీసెర్చ్ :     2 – 4 సీట్లు
  • పీ-మార్క్ : 1 – 4 సీట్లు
  • జేవీసీ ఎగ్జిట్ పోల్స్ : 0 – 1 సీటు
  • పీపుల్స్ ఇన్‌సైట్  :     0 – 2 సీట్లు
  • చాణక్య :     0 సీట్లు
Advertisment
తాజా కథనాలు