జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో నిన్న పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి దేశం మొత్తాన్ని షాక్ కు గురిచేసింది. ఈ కాల్పుల్లో దాదాపుగా 30 మంది టూరిస్టులు చనిపోయారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్ అంతటా ఉన్న చాలా ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో పోలీసులు భద్రతను పెంచారు. శ్రీనగర్‌లోని చాలా దుకాణాలు, పెట్రోల్ పంపులు కూడా మూసివేయబడ్డాయి. కేవలం నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు మాత్రమే తెరిచి ఉన్నాయి.
అయితే ఉగ్రవాదుల దాడి వెనుక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే దుండగులు ఈ ఘాతాకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు రాజౌరి నుండి చత్రు, వాధవన్ మీదుగా పహల్గాంకు చేరుకున్నారు. ఇది రియాసి ఉదంపూర్ ప్రాంతంలో వస్తుంది. ఉగ్రవాదులు దాదాపు 2 వారాల క్రితం ఇండియాలోకి ఏంట్రీ ఇచ్చారు. పహల్గాంలోనే దాక్కుని దాడి రోజు కోసం వేచి చూశారు.
హెల్మెట్లపై కెమెరాలు
పర్యాటకులపై దాడి సమయంలో ఉగ్రవాదులు తమ హెల్మెట్లపై కెమెరాలు ధరించారు, తద్వారా మొత్తం సంఘటనను వీడియో చిత్రీకరించారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తమ సంస్థకు పంపారు. ఉగ్రవాద దాడి జరిగిన ప్రదేశాన్ని చూస్తుంటే, కొంతమంది ఉగ్రవాదులు స్నిపర్ కాల్పుల మాదిరిగా దూరం నుండి పర్యాటకులపై కాల్పులు జరిపినట్లు అనిపిస్తుంది. AK-47 వంటి ఆధునిక ఆయుధాలతో కాల్పులు జరపడం వల్ల అధిక రక్తస్రావం అయింది. దీంతో పర్యాటకులను రక్షించడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రాణనష్టం ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్నందున నేరస్థలాన్ని ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ దాడికి పీఓకే నుంచే ప్రణాళిక వేసినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానించాయి. దాడికి ముందు, రావల్కోట్‌లో ఉగ్రవాదుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చాలా మంది భయంకరమైన ఉగ్రవాదులు ఉన్నారు. ఈ సమావేశంలో, కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకోవడం గురించి స్పష్టమైన చర్చ జరిగింది. అంతేకాకుండా వారు భారతదేశంపై విషం చిమ్మారు. ఈ వీడియోకు పహల్గామ్ దాడికి సంబంధం ఉందా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. చాలా మంది పర్యాటకులు సందర్శన కోసం వెళతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, కొండ ప్రాంతాలలో భద్రతను పెంచాలి. దీనితో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పిటిషన్‌లో మార్గదర్శకాలను జారీ చేయాలి. ఉగ్రవాద దాడి లేదా పర్యాటకులపై దాడి జరిగితే, తక్షణ వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.