Rajasthan : పాకిస్థాన్ కు గూఢచర్యం..పంజాబ్ వ్యక్తి అరెస్ట్ !

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ విభాగం పంజాబ్ నివాసిని అరెస్టు చేసింది.

New Update
rajasthan

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI) కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై రాజస్థాన్ పోలీసుల సీఐడీ ఇంటెలిజెన్స్ విభాగం పంజాబ్ నివాసిని అరెస్టు చేసింది. నిందితుడిని ప్రకాష్ సింగ్ అలియాస్ బాదల్ (34)గా గుర్తించారు. సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్న ఆరోపణలతో శ్రీ గంగానగర్‌లోని ఒక సైనిక ప్రాంతం సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రఫుల్ల కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నివాసి అయిన ప్రకాష్ సింగ్..  ఆపరేషన్ సింధూర్ సమయం నుండి సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ ద్వారా తన ఐఎస్ఐ హ్యాండ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉన్నాడు. ఇతను రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ అంతటా భారత సైన్యం కదలికలు, సైనిక కార్యకలాపాలు, ట్రూప్ మూమెంట్స్, వాహనాలు, సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, వంతెనలు,  రైల్వే ట్రాక్‌ల నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

మొబైల్ నంబర్ల నుండి OTPలు 

నిందితుడు ఇతరుల మొబైల్ నంబర్ల నుండి OTPలను పొంది, వారి పేర్లతో వాట్సాప్ ఖాతాలను సృష్టించి, ఆ ఖాతాల ద్వారా పాకిస్థాన్‌కు సమాచారాన్ని షేర్ చేసేవాడని దర్యాప్తులో తేలింది. ఈ కార్యకలాపాలకు అతను పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నాడు. నవంబర్ 27న, అనుమానాస్పద కదలికల సమాచారం మేరకు శ్రీ గంగానగర్‌లోని సాధువాలీ మిలిటరీ జోన్ సమీపంలో బార్డర్ ఇంటెలిజెన్స్ బృందం అతన్ని అదుపులోకి తీసుకుంది.

 అతని ఫోన్‌లో అనేక పాకిస్థానీ నంబర్లతో వాట్సాప్ చాట్‌లు ఉన్నట్లు గుర్తించారు. శ్రీ గంగానగర్‌లోని జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్, ఆ తర్వాత జైపూర్‌లో జరిగిన విచారణలో డిజిటల్ ఆధారాలు గూఢచర్య కార్యకలాపాలను ధృవీకరించాయి. డిసెంబర్ 1న, అతనిపై జైపూర్‌లోని స్పెషల్ పోలీస్ స్టేషన్‌లో అధికార రహస్యాల చట్టం, 1923 కింద కేసు నమోదు చేశారు. రాజస్థాన్.  పంజాబ్‌లలో అతని నెట్‌వర్క్‌లో ఉన్న ఇతరులను గుర్తించడానికి తదుపరి విచారణ కొనసాగుతోంది.