/rtv/media/media_files/2025/10/31/mughal-era-painting-2025-10-31-18-30-57.jpg)
భారతీయ క్లాసికల్ ఆర్ట్ మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన అరుదైన ఘట్టం లండన్‌లో జరిగింది. 16వ శతాబ్దానికి చెందిన మొఘల్ కాలం నాటి సూక్ష్మ చిత్రకళ (మినియేచర్ పెయింటింగ్) ఒకటి ప్రముఖ క్రిస్టీస్ వేలంలో రూ.120 కోట్లు (సుమారు $13.6 మిలియన్లు) పలికింది. అనుకున్నదాని కన్నా సుమారు 14 రెట్లు అధిక ధరకు ఆ చిత్రపటం వేలంలో అమ్ముడుపోయింది. దీన్ని క్రిస్టీ వేలం చరిత్రలో రికార్డుగా భావిస్తున్నారు.
'ఎ ఫ్యామిలీ ఆఫ్ చీతాస్ ఇన్ ఎ రాకీ ల్యాండ్‌స్కేప్' అనే శీర్షికతో ఈ అద్భుతమైన చిత్రాన్ని మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలోని ప్రసిద్ధ చిత్రకారుడు బసవాన్ 1570లో చిత్రించినట్లు భావిస్తున్నారు. ఈ పెయింటింగ్ కేవలం 29.8 సెం.మీ. ఎత్తు, 18.6 సెం.మీ. వెడల్పు మాత్రమే కలిగి ఉంది. కాన్వాస్‌పై కాకుండా, వస్త్రంపై రంగులు, బంగారు రేకులతో దీనిని అత్యంత సున్నితంగా చిత్రించారు. రాతి భూభాగంలో చిరుతపులుల కుటుంబం సహజత్వాన్ని అద్భుతంగా చిత్రీకరించిన ఈ కళాఖండాన్ని, మొఘల్ కళలోని తొలి ప్రకృతి అధ్యయనాలలో ఒకటిగా కళా చరిత్రకారులు పరిగణిస్తారు.
లండన్‌లో అక్టోబర్ 30న జరిగిన ఈ వేలం "ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ సద్రుద్దీన్ ఆగాఖాన్ పర్సనల్ కలెక్షన్ నుంచి అత్యుత్తమ పెయింటింగ్‌లు పేరుతో నిర్వహించబడింది. దాదాపు 45 ఏళ్ల పాటు వారు సేకరించిన విలువైన భారతీయ, పర్షియన్ కళాఖండాల సేకరణలో ఈ బసవాన్ చిత్రం అత్యంత ముఖ్యమైనది. ఈ వేలంలో విక్రయించిన 95 కళాఖండాల మొత్తం విలువ సుమారు రూ. 540 కోట్లు పలికింది.
Follow Us