Train Accident: ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 12 బోగీలు (వీడియో)

మథుర జిల్లాలోని చౌముహన్ సమీపంలో ఆగ్రా-ఢిల్లీ మార్గంలో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సుమారు 12 బోగీలు బోల్తా పడటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు.

New Update
mathura train accident around 12 train coaches

mathura train accident around 12 train coaches

ఉత్తరప్రదేశ్‌లోని మథుర సమీపంలో మంగళవారం రాత్రి (అక్టోబర్ 21) ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-ఆగ్రా రైలు మార్గంలోని చౌముహన్ ప్రాంతంలో బొగ్గుతో వెళ్తున్న ఒక గూడ్స్ రైలుకు చెందిన సుమారు 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన కారణంగా ఢిల్లీ-ఆగ్రా, ఢిల్లీ-ముంబై ప్రధాన రైలు మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

చౌముహన్ వద్ద గల అఝాయి, బృందావన్ రోడ్ స్టేషన్ల మధ్య రాత్రి 8:24 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పట్టాలు తప్పిన బోగీలు అప్‌ మెయిన్ లైన్, డౌన్ మెయిన్ లైన్, మూడవ లైన్లను పూర్తిగా అడ్డుకోవడంతో రైళ్ల సేవలు నిలిచిపోయాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ఎవరికీ గాయాలు గానీ అయినట్లు సమాచారం లేదు. 

పలు రైళ్లు ఆలస్యం

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు మరియు స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి, ట్రాక్‌లను పునరుద్ధరించే పనులు చేపట్టారు. ఈ ప్రమాదంతో రాజధాని, శతాబ్ది వంటి సుమారు డజనుకు పైగా ప్రధాన రైళ్లు మథుర, ఆగ్రా కంటోన్మెంట్ వంటి స్టేషన్లలో నిలిచిపోయాయి. దీంతో వందలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ప్రయాణీకులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఆశ్రయించగా, మరికొందరు స్టేషన్లలోనే నిరీక్షించారు. 

రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పునరుద్ధరణ పనులు రాత్రంతా కొనసాగాయి. నాలుగవ లైన్ ద్వారా కొన్ని రైళ్లను జాగ్రత్తగా నడిపించడానికి ఏర్పాట్లు చేశారు. ట్రాక్‌ను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులు ఆదేశించారు. ఈ ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. ట్రాక్‌ల మరమ్మత్తు పూర్తయితేనే ఈ మార్గంలో సాధారణ రైళ్ల రాకపోకలు మొదలవుతాయని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్లలో ఆహారం, నీరు అందించడానికి ఏర్పాట్లు చేశారు. 

Advertisment
తాజా కథనాలు