/rtv/media/media_files/2025/11/18/hidma-story-2025-11-18-17-32-20.jpeg)
హిడ్మా.. ఈ పేరు గత కొన్ని సంవత్సరాలుగా మార్మోగుతోంది. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులతోపాటు CRPF బలగాలకు ఈ పేరు నిద్ర పట్టనివ్వలేదు. పోలీసులను, ప్రత్యేక కేంద్ర బలగాలను ముప్పతిప్పలు పెట్టి దండకారణ్యం అడవుల్లో మూడు చెరువుల నీళ్లు తాగించాడు హిడ్మా. అనేక సార్లు చిక్కినట్లే చిక్కి మెరుపువేగంతో తప్పించుకున్నాడు. చివరికి మంగళవారం ఏపీలోని అల్లూరి జిల్లాలో మన్నెం అడువుల్లో ఎన్‌కౌంటర్ అయ్యాడు. ఆపరేషన్ కగార్ ఉధృతంగా సాగుతుండడం.. వందలాది మంది నక్సలైట్లు నేలకొరుగుతుండడం.. అదే సమయంలో అగ్ర నేతలు లొంగిపోతున్నా అతను ఏమాత్రం జంకలేదు.
ఏదో ఒక రోజు బలగాలు తన దగ్గరికి వచ్చే అవకాశం ఉందని తెలిసినా వెనక్కి తగ్గలేదు. నిమ్మిన సిద్ధాంతం కోసం మరింత ముందుకే నడిచాడు. ఆపరేషన్ కర్రెగుట్టలు స్టార్ట్ చేసిందే తనను చంపడానికి అన్న విషయం కూడా ఆయనకు తెలుసు. ఇటీవల ఏకంగా చత్తీస్ గడ్ డిప్యూటీ సీఎం హిడ్మా ఇంటికి వెళ్లి.. అతని తల్లితో మాట్లాడి లొంగిపోవాలని చెప్పించాడు. ఇదే ఆఖరి వార్నింగ్ అన్న సంకేతాలు పరోక్షంగా ఇచ్చాడు. అయినా లొంగిపోలేదు. చావనైన చస్తాను కానీ మీ ముందు తలవంచను.. ఇదే హిడ్మా నైజం. ఐదున్నర అడుగుల ఎత్తు, బక్కపలచని శరీరం, చేతిలో AK 47 తుపాకీ ఇవన్నీ పవర్‌ఫుల్ కాదు. కానీ ఆయన మైండే చాలా పవర్‌ఫుల్. మావోయిస్ట్ మాస్టర్ మైండ్‌గా హిడ్మాని పిలుస్తారు.
అందరు అన్నల్లా హిడ్మా తుపాకి పట్టుకొని ఫైట్ చేయడు. ఆయన మాస్టర్ మైండ్‌తో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తాడు. హిడ్మా స్కెచ్ వేశాడంటే 10కి పైనే డెడ్‌బాడీలు లేవాల్సిందే. హిడ్మా అనేక మారణహోమాలకు నేతృత్వం వహించినట్లు భద్రతా ఏజెన్సీలు భావిస్తున్నాయి.
వాటిలో కొన్ని:
2010 దంతెవాడ దాడి: 76 మంది సీఆర్‌పీఎఫ్ (CRPF) జవాన్లను పొట్టనపెట్టుకున్న ఘోరమైన దాడి.
2013 దర్భా లోయ దాడి: ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మొత్తాన్ని లక్ష్యంగా చేసుకున్న దాడి.
2017 సుక్మా దాడి: 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు.
2021 టెకల్గూడ-జగరగుండం దాడి: 22 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు.
మావోయిస్ట్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తుందో అప్పుడు హిడ్మాని రంగంలోకి దింపుతుంది. హిడ్మాకు అడవుల్లో గెరిల్లా యుద్ధంలో అపారమైన అనుభవం ఉంది. బస్తర్ అడవుల గురించి ఇతనికి పూర్తిగా తెలుసు. ఈ కారణంగానే దశాబ్దాలుగా భద్రతా బలగాలకు చిక్కకుండా తప్పించుకుంటూ వచ్చాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) బెటాలియన్ నం.1 కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు. హిడ్మా AK-47 రైఫిల్‌తో పాటు నాలుగు అంచెల భద్రత ఉంటుంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూర్వతి గ్రామంలో 1981న జన్మించిన హిడ్మా..17 ఏళ్లకే అడవి బాట పట్టాడు. సుమారు 1990ల చివర్లో హిడ్మా బాల సంగం క్యాడర్‌గా మావోయిస్టు ఉద్యమంలో చేరారు. మావోయిస్టు అగ్రనాయకుల్లో ఎక్కువ మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారు ఉంటారు. కానీ హిడ్మా ఒక్కడే సీపీఐ (మావోయిస్ట్) సెంట్రల్ కమిటీలో బస్తర్ ప్రాంతం నుంచి ఎన్నికైన ఏకైక గిరిజన నాయకుడు. చిన్న వయసులోనే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో కీలక సభ్యుడిగా, ఆ తర్వాత కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఎదిగాడు.
అవకాశం వచ్చినా లొంగిపోలేదు..
సీపీఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, సెంట్రల్ కమిటీ సభ్యులు చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, సహదేవ్ సొరేన్, అరుణ, గాజర్ల రవి లాంటి కీలక నేతలు ఆపరేషన్ కగార్ ఎన్‌కౌంటర్‌లో హతమైయ్యారు. మరోవైపు కీలక నేతలు మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న, పోతుల సుజాత, రూపేశ్ అలియాస్ సతీష్ లు ఇటీవల లొంగిపోయారు. మావోయిస్ట్ అగ్రనాయకులు సైతం తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అయినా హిడ్మా లొంగిపోలేదు.
హిడ్మాకు లాస్ట్ ఛాన్స్
నవంబర్ 11న ఛత్తీస్‌ఘడ్ సీఎం హిడ్మా తల్లితో మాట్లాడారు. హిడ్మాని లొంగిపోవాలని కోరుతూ.. ఆమెతో ఓ వీడియో చేయించారు. అయినా అతను వినలేదు. భద్రతా బలగాలు హిడ్మా టీంని చుట్టుముట్టినప్పుడు ఆకరి నిమిషంలో లొంగిపోవాలని కోరాయి. హిడ్మా తన ఎదురుగా ఉన్న చావుని కూడా లెక్కచేయకుండా కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో హిడ్మా, అతని భార్యతోపాటు ఆరుగురు హతమైయ్యారు.
U టైప్ గొరిల్లా దాడుల్లో ఆరితేరాడు..
హిడ్మా ఇండొనేషియాలోని గెరిల్లా దాడుల్లో ట్రైనింగ్ తీసుకున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. అతడు U టైప్ గెరిల్లా దాడిలో ఆరితేరాడు. భద్రతా బలగాలు వస్తున్నాయని ముందే సమాచారం వస్తుంది. వారిని ఎదుర్కొనకుండా లోనికి రానిస్తారు. చుట్టూ కొండలు ఉండి.. మధ్యలో లోతైన ప్రదేశం వరకు వాళ్లు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత మూడు వైపులా మావోయిస్టులు చుట్టేస్తారు. తర్వాత భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతారు. ఎడమ వైపు, కుడి వైపు, వెనుక వైపు మావోయిస్టులు ఉండి దాడి చేస్తారు. పోలీసులు ముందు వైపు కొండెక్కి పారిపోవడానికి టైం దొరకదు. ఇలాంటి సందర్భాల్లో భద్రతా బలగాల ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. ఇలాంటి దాడులు చేయడంలో హిడ్మాకు సిద్ధహస్తుడిగా పేరుంది. 2021 ఛత్తీస్‌గఢ్‌లో జరిపిన మావోయిస్టు దాడిలో 24 మందికి పైగా జవాన్లు చనిపోయారు. ఈ దాడికి నేతృత్వం వహించింది కూడా హిడ్మానే.
Follow Us