రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్.. దేశం గురించి ఆయన ఏమన్నారంటే ?

ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌ టాటాకు భారత రత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. మహారాష్ట్ర కేబినెట్ కూడా ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించింది. దేశం గురించి రతన్ టాటా ఏమన్నారో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Ratan tata

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎక్కడా చూసిన ఆయన గురించే వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఆయనకు సంతాపం తెలుపుతూ ఎక్స్‌లో, వాట్సాప్‌ స్టేటస్‌లలో పోస్టులు పెడుతున్నారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రతన్ టాటా బుధవారం రాత్రి ముంబయిలోని క్యాండీ బ్రీచ్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుంటూ తుది శ్వాస విడిచారు. అనేక కంపెనీలను స్థాపించిన రతన్‌ టాటా భారత దేశం గర్వించే దిగ్గజ వ్యాపారవేత్తగా చరిత్ర సృష్టించారు. 2008లో భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అయితే గతంలోనే రతన్‌ టాటాకు భారత అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' ఇవ్వాలని సోషల్‌ మీడియాలో పలువురు ప్రముఖులతో పాటు నెటిజన్లు డిమాండ్లు చేశారు. కానీ రతన్ టాటా మాత్రం ఇలాంటి వాటిని ప్రోత్సహించలేదు. 

Also Read: రతన్ టాటాకు ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా?

భారత రత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని వెంటనే ఆపాలని కోరుతూ మూడేళ్ల క్రితం ఓ పోస్టులో విజ్ఞప్తి చేశారు. భారతీయుడిగా పుట్టడమే తాను చేసుకున్న అదృష్టంగా భావిస్తానని తెలిపారు. దేశ అభివృద్ధిలో, సంపదను పెంచడంలో తనవంతు సహకారం అందించినందుకు చాలా సంతోషంగా ఉందని రతన్ టాటా పేర్కొన్నారు. పురస్కారాలు, పదవుల కంటే తనకు దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని పాటించారు. అయితే మూడేళ్ల క్రితం రతన్‌ టాటా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరలవుతున్నాయి. భారతదేశం గర్వించే పారిశ్రామికవేత్త, యువతకు ఆదర్శంగా నిలిచిన రతన్‌ టాటాకు భారత రత్న ఇవ్వాల్సిందేనని సోషల్‌మీడియాలో నెటిజెన్లు మళ్లీ డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర కేబినెట్‌ కూడా రతన్‌ టాటాను భారత రత్నతో సత్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. మరి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రతన్‌ టాటాకు భారత రత్న పురస్కారంతో గౌరవిస్తుందో లేదో తెలియాలంటే మరి కొంత కాలం వేచిచూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు