‘మా నాన్న పని అయిపోయినట్లే’.. సిద్ధరామయ్య కొడుకు సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుపై ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కొంత కాలంగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన కొడుకు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైయ్యాయి.

New Update
CM Siddaramaiah son

కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిద్ధరామయ్య రాజకీయ భవిష్యత్తుపై ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గతకొంత కాలంగా కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన కొడుకు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైయ్యాయి. సిద్ధరామయ్య కుమారుడు  చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. 

మైసూర్ జిల్లాలోని తన స్వస్థలంలో జరిగిన ఓ కార్యక్రమంలో యతీంద్ర మాట్లాడుతూ, సిద్ధరామయ్యకు 75 ఏళ్లు దాటిన విషయాన్ని ప్రస్తావించారు. "ప్రస్తుతం ఆయనకు వయస్సు పెరుగుతోంది. ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు, బాధ్యతలు చూశారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత, ఆయన రాజకీయ జీవితం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందని నేను భావిస్తున్నాను," అని యతీంద్ర అన్నారు.

ముఖ్యమంత్రి మార్పు గురించి వస్తున్న ఊహాగానాలపై యతీంద్ర క్లారిటీ ఇచ్చారు. "మా నాన్న ఈ ఎన్నికల్లోనే పోటీ చేయడం ఆఖరు అని స్పష్టం చేశారు. కానీ, ఆయన ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనకు ఇంకా శక్తి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి, ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి పదవీకాలాన్ని పూర్తి చేస్తారని నేను విశ్వసిస్తున్నాను," అని తెలిపారు. యతీంద్ర వ్యాఖ్యలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి మార్పు, వారసత్వం గురించి జరుగుతున్న అంతర్గత చర్చలకు మరింత బలాన్ని ఇచ్చాయి. సిద్ధరామయ్య ఇప్పటికే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే, తనకు ఇదే చివరి ఎన్నికలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, యతీంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కురుబ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆయన రాజకీయ వారసత్వంపై, ఆయన తర్వాత కాంగ్రెస్‌లో ముఖ్య నాయకత్వంపై ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి.

Advertisment
తాజా కథనాలు