Indias Tejas Fighter Jet: మన తేజస్‌ భద్రమేనా?

ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌ షోలో మన తేజస్-ఎంకే1 నేలకూలడంతో మన తేజస్‌ యుద్ధ విమనాలు భద్రమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు పలు దేశాలు ఆసక్తి చూపుతున్న దశలో కూలిపోవడం వల్ల తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

New Update
FotoJet - 2025-11-24T103105.201

Indias Tejas Fighter Jet

Indias Tejas Fighter Jet: ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌ షోలో మన తేజస్-ఎంకే1 నేలకూలడంతో మన తేజస్‌ యుద్ధ విమనాలు భద్రమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  సింగిల్‌ ఇంజిన్‌తో కూడిన నాలుగో తరం యుద్ధవిమానం ఈ తేజస్-ఎంకే1. మన తేజస్‌ను కొనుగోలు చేసేందుకు అర్జెంటీనా, ఈజిప్ట్‌, నైజీరియా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇలాంటి తరుణంలో కూలిపోవడం వల్ల తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎఫ్‌-16లు, రఫేల్‌ యుద్ధవిమానాల వంటివి తొలిదశల్లో ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో నేలకూలినట్టు గత గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి భారత వాయుసేన వద్ద రెండు స్క్వాడ్రన్ల తేజస్-ఎంకే1లు ఉన్నాయి. 

2001లో మొదటిసారి టెస్ట్‌ ఫ్లైట్‌ నిర్వహించింది. అప్పటి నుంచి దాదాపు 18 వేల గంటల ఫ్లీట్‌ ఫ్లైయింగ్‌ అవర్స్‌ నమోదు చేసింది.అలాంటి తేజస్‌ విమానం ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. మొదటి ప్రమాదం గత ఏడాది జరిగింది. 2024 మార్చిలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఒక తేజ్‌స-ఎంకే1 కూలిపోయింది. తేజ్‌ తయారు చేసి 24 సంవత్సరాలు అయింది. ఈ  వ్యవధిలో రెండు ప్రమాదాలు అంటే చాలా తక్కువే. కానీ, విమాన ప్రమాదాలను ‘ఫ్లైట్‌ అవర్స్‌’ లెక్కలో కొలుస్తారు. లక్ష గంటల ఫ్లైట్‌ అవర్స్‌లో సగటున ఎన్ని ప్రమాదాలు జరిగాయి అనే లెక్క ఆధారంగా ఆయా విమానాలు ఎంతవరకూ సురక్షితమో తేలుస్తారు. ఉదాహరణకు.. అమెరికాకు చెందిన ఎఫ్‌-16 యుద్ధవిమానాలను తీసుకుంటే.. 1975-1993 నడుమ లక్ష ఫ్లైట్‌ అవర్స్‌లో సగటున 5 ‘క్లాస్‌-ఏ’ ప్రమాదాలు జరిగాయి (‘క్లాస్‌-ఏ’ ప్రమాదాలంటే.. పైలట్‌ ప్రాణాలు కోల్పోవడం లేదా శాశ్వత వైకల్యానికి గురికావడం లేదా ఆ ప్రమాదం వల్ల 20 లక్షల డాలర్లకు మించి నష్టం వాటిల్లడం). అదే సమయంలో . 1975 సంవత్సరం ఒక్కదాన్నే లెక్కలోకి తీసుకుంటే.. ఒక ఎఫ్‌-16 నేలకూలి పైలట్‌ చనిపోయారు. ఆ ఏడాది ఎఫ్‌-16 యుద్ధవిమానాలు 161 గంటలపాటు ఎగిరాయి. ఎగిరిన గంటలు, పోయిన ప్రాణాల ఆధారంగా లెక్కిస్తే ((1/161) ణ 100,000).. ప్రమాదాల సగటు 621.11. రెండో ఏడాదికి ఆ సగటు 442.48కి తగ్గింది. ఇలా ఎఫ్‌-16లు ఇప్పటిదాకా ఎగిరిన గంటలన్నింటినీ కలిపి లెక్కిస్తే ఆ ప్రమాదాల సగటు 3.55కు తగ్గింది.

అయితే మన తేజస్‌ ఎంకే1 ‘క్యుములేటివ్‌ ఆపరేషనల్‌ ఫ్లైట్‌ అవర్స్‌’కు సంబంధించి అధికారిక గణాంకాలు అందుబాటులో లేవు. ఉన్న ‘దాదాపు 18 వేల గంటల ఫ్లైట్‌ అవర్స్‌’ అనే అంచనా లెక్కనే పరిగణనలోకి తీసుకుంటే దాన్ని లక్ష గంటలకు అన్వయిస్తే.. ((2/18,000) ణ 100,000).. సగటున 11.1 ప్రమాదాలతో సమానం. అమెరికన్‌ ఎఫ్‌-16 తొలినాటి ప్రమాదాల లెక్కతో పోలిస్తే ఇది చాలా తక్కువ కిందే లెక్క. ఇక.. ఫ్రాన్స్‌కు చెందిన దసో కంపెనీ నుంచి మనం కొంటున్న రఫేల్‌ యుద్ధవిమానాల విషయానికి వస్తే.. లక్ష గంటల ఫ్లైట్‌ అవర్స్‌లో 1.73 నుంచి 3 క్లాస్‌-ఏ ప్రమాదాలు జరిగాయి.  పాకిస్థాన్‌ వద్ద ఉన్న జేఎఫ్‌-17 యుద్ధవిమానాల ఫ్లైట్‌ అవర్స్‌ 19 నుంచి 25 వేల గంటలు.2007 నుంచి 2024 నడుమ ఆరు జేఎప్‌-17లు నేలకూలాయి. 19 వేల ఫ్లైట్‌ అవర్స్‌ను లక్ష ఫ్లైట్‌ అవర్స్‌కు అన్వయిస్తే.. 26.3 ప్రమాదాలతో సమానం. అయితే, ఎఫ్‌-16లు, రఫేల్‌ యుద్ధవిమానాలకు లక్షల గంటల ఫ్లైట్‌ అవర్స్‌ ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో నిర్దిష్ట డేటా దొరుకుతోంది. కానీ.. తేజ్‌స-ఎంకే1, జేఎఫ్‌-17ల విషయంలో లక్ష గంటల ఫ్లైట్‌ అవర్స్‌ ఇంకా నమోదు కాలేదు. కనుక నిర్ధిష్ట డేటా చెప్పలేం. కానీ, మన తేజస్‌ ఎంకే1కు సంబంధించి 24 ఏళ్ల కాలంలో జరిగినవి రెండే ప్రమాదాలు.
 

నమ్మకం తగ్గుతుందా?

మన తేజస్‌ యుద్ధవిమానం కూలిపోవడం వల్ల వాయుసేనకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌)పై ఉన్న విశ్వసనీయత మరింత తగ్గే  అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌)పై భారత వాయుసేనకు నమ్మకం కలగట్లేదని ఫిబ్రవరిలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. 2025 ఫిబ్రవరి నాటికే 11 ‘తేజస్‌-ఎంకే1ఏ’ యుద్ధవిమానాలను సరఫరా చేస్తామన్న హాల్‌ ఒక్క విమానాన్ని కూడా సిద్ధం చేయలేకపోయింది. విమానాల తయారీలో ఆలస్యానికి కారణం.. జీఈ సంస్థ నుంచి ఎఫ్‌404 ఇంజిన్లు రాకపోవడమేనని హాల్‌ సంస్థ గతంలో చెప్పింది. అక్టోబరు 17కు రెండు తేజ్‌స-ఎంకే1ఏ విమానాలను సరఫరా చేస్తామని తెలిపింది. అన్నట్లుగానే జీఈ కంపెనీ నుంచి ఇంజిన్లు వచ్చాయి. 4ఇంజిన్లు సిద్ధంగా ఉన్నాయి. కానీ.. నవంబరు ముగుస్తున్నా విమానాలు మాత్రం వాయుసేనకు అందలేదు. మరోవైపు.. మిగ్‌ విమానాలను కూడా ఈ ఏడాదే యుద్ధ సేవల నుంచి తొలగించడంతో వాయుసేన వద్ద స్క్వాడ్రన్‌ బలం బాగా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో.. తేజ్‌స-ఎంకే1 విమానం కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో మన తేజస్‌ను విశ్వసనీయత పెంచే రీతిలో తయారు చేయాల్సిన అవసరం ఉంది.

Advertisment
తాజా కథనాలు