Ajit Doval: మొబైల్ ఫోన్, ఇంటర్‌నెట్ వాడని ఇండియన్ జేమ్స్ బాండ్.. ఎందుకంటే?

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తన పనితీరుతో 'భారతీయ జేమ్స్ బాండ్'గా గుర్తింపు పొందారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026' ప్రొగ్రామ్‌లో పాల్గొన్న ఆయన మొబైల్ ఫోన్, ఇంటర్నెట్‌ను వాడనని చెప్పారు.

New Update
Ajit Doval - On a Mission

ఇండియన్ నేషనల్ సెక్యురిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ తన పనితీరుతో 'భారతీయ జేమ్స్ బాండ్'గా గుర్తింపు పొందారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026' ప్రొగ్రామ్‌లో పాల్గొన్న ఆయన మొబైల్ ఫోన్, ఇంటర్నెట్‌ను వాడనని చెప్పారు. ఈ డిజిటల్ యుగంలో ఫోన్, ఇంటర్‌నెట్ వాడకుండా కూడా ఉండగలరా అని అందరూ షాక్ అవుతున్నారు. సామాన్యులకే ప్రస్తుత రోజుల్లో ఫోన్, ఇంటర్‌నెట్‌ లేకుండా ఒక్కరోజు గడవదు. అలాంటిది ఓ అత్యున్నత భద్రతా అధికారి డిజిటల్ సాధనాలకు దూరంగా ఉండటం సాధ్యమేనా అని సందేహపడుతున్నారు. ఫోన్ వాడకుండా ఆయన నిఘా సమాచారాన్ని ఎలా తెలుసుకుంటారో చూద్దాం.. 

అజిత్ దోవల్ మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్‌కు దూరంగా ఉండటానికి ప్రధానంగా భద్రతా పరమైన కారణాలు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న పరికరాలు సులభంగా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. శత్రు దేశాలు లేదా గూఢచారి సంస్థలు వాటిని నుంచి హ్యాక్ చేసి దేశ భద్రతకు చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉంది. దేశ భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా, ఆయన తన కమ్యూనికేషన్ అత్యంత గోప్యంగా ఉండాలని కోరుకుంటారు.

ఫోన్ లేకుండా కమ్యూనికేషన్ ఎలా?

మొబైల్ ఫోన్ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకుంటారని అడిగిన ప్రశ్నకు ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

ప్రభుత్వం అందించే అత్యంత సురక్షితమైన ల్యాండ్‌లైన్ నెట్‌వర్క్‌లు, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను ఆయన ఉపయోగిస్తారు. క్షేత్రస్థాయిలో ఉన్న తన నెట్‌వర్క్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. సామాన్య ప్రజలకు తెలియని అనేక ఇతర సమాచార మార్పిడి పద్ధతులు ఉన్నాయని, తాను వాటిని అనుసరిస్తానని ఆయన పేర్కొన్నారు. అయితే, విదేశాల్లో ఉన్నవారితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు లేదా కుటుంబ సభ్యులతో అత్యవసర సంభాషణల కోసం మాత్రమే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పరిమితంగా ఫోన్‌ను ఉపయోగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన యువతకు క్రమశిక్షణ, ఏకాగ్రత గురించి విలువైన సందేశాన్ని ఇచ్చారు.

"నేటి ప్రపంచంలో ప్రచారం కంటే పనితీరు ముఖ్యం. నిశ్శబ్దంగా మీ లక్ష్యాలను సాధించండి. ధైర్యవంతులు ఎప్పుడూ సహనంగా ఉంటారు, భయపడేవారే శబ్దం చేస్తారు" అని ఆయన హితబోధ చేశారు. 81 ఏళ్ల వయస్సులో కూడా అజిత్ దోవల్ చూపుతున్న ఈ అంకితభావం, దేశ రక్షణ పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. ఆధునిక కాలంలో సాంకేతికత అవసరమే అయినా, దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదనే పాఠాన్ని ఆయన తన లైఫ్‌స్టైల్ ద్వారా నేర్పుతున్నారు.

Advertisment
తాజా కథనాలు