/rtv/media/media_files/2026/01/31/notam-2026-01-31-15-37-41.jpg)
భారత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమవుతోంది. బంగాళాఖాతం వేదికగా భారీ క్షిపణి పరీక్షను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాత గగనతలంలో పౌర విమానాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నోటమ్ జారీ చేసింది. గతంలో క్షిపణి పరీక్షల సమయంలో నోటమ్ పరిమితి సాధారణంగా 2,530 కిలోమీటర్ల వరకు ఉండేది. అయితే, ఈసారి దీనిని ఏకంగా 3,190 కిలోమీటర్లకు పెంచడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో గగనతలాన్ని మూసివేయడం వెనుక భారత్ ఏదైనా సుదూర లక్ష్యాలను ఛేదించే స్ట్రాటజిక్ క్షిపణిని (బహుశా సముద్ర ఆధారిత లేదా సబ్-మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్) పరీక్షించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ భారీ పరిధిని బట్టి చూస్తే అది K-సిరీస్ (సబ్ మెరైన్ లాంచ్డ్) క్షిపణి లేదా అధునాతన అగ్ని శ్రేణి క్షిపణి అయ్యి ఉంటుందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, సముద్ర గర్భం నుండి సుదూర లక్ష్యాలను ఛేదించడంలో భారత్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది.
NOTAM అంటే..?
NOTAM అంటే Notice to Airmen. సులభంగా చెప్పాలంటే విమాన సిబ్బందికి ఇచ్చే అధికారిక హెచ్చరిక. నిర్దిష్ట ప్రాంతంలో, నిర్దిష్ట సమయంలో ప్రయాణం ప్రమాదకరమని విమానయాన సంస్థలను అప్రమత్తం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. క్షిపణి పరీక్షలు, యుద్ధ విన్యాసాలు లేదా రాకెట్ ప్రయోగాల సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా ఈ నోటీసులు జారీ చేస్తారు. ఈ కాలంలో పౌర విమానాలు ఆ గగనతలంలోకి ప్రవేశించడానికి వీలుండదు.
ఆపరేషన్ సింధూర్ తర్వాత వేగవంతం
ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సింధూర్' తర్వాత ఇండియా తన స్వదేశీ ఆయుధ సంపత్తిని పెంచుకోవడంలో దూకుడు పెంచింది. ముఖ్యంగా హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాల కదలికల నేపథ్యంలో భారత్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఫిబ్రవరిలో జరగబోయే ఈ పరీక్ష ద్వారా భారత్ తన క్షిపణి సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పనుంది.
Follow Us