/rtv/media/media_files/2026/01/05/iran-2026-01-05-21-20-41.jpg)
Violent Protests
Violent Protests: ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలు, కరెన్సీ పతనంతో ఇరాన్‌లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసణలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడి ఇండియన్స్‌కు కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ సోమవారం భారత పౌరులు తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఇరాన్‌కు 'అనవసర ప్రయాణాలను' మానుకోవాలని సూచించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ఇతర నగరాల్లో నిరసనలు ఉధృతంగా సాగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం.
Also Read: ముదురుతున్న శివాజీ - అనసూయ వివాదం...నటుడు సుమన్ ఏమన్నారంటే..?
ఇప్పటికే ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఇతర కారణాలతో ఇరాన్‌లో నివసిస్తున్న భారత పౌరులు, భారత సంతతి వ్యక్తుల కోసం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైస్వాల్ కొన్ని కీలక సూచనలు చేశారు. ఇరాన్‌లో ఉన్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, నిరసన ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు, భారీ జనసమూహాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇరాన్‌లో రెసిడెంట్ వీసాలపై ఉంటున్న భారత పౌరులు ఒకవేళ ఇప్పటివరకు భారత రాయబార కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోకపోతే, వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం వెబ్‌సైట్, వారి సోషల్ మీడియా ఖాతాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, తద్వారా తాజా పరిస్థితులను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
ఇరాన్ కరెన్సీ 'రియాల్' విలువ రికార్డు స్థాయిలో పడిపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. అంతర్జాతీయ ఆంక్షలు, అంతర్గత ఆర్థిక విధానాల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నిరసనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇప్పటికే పలువురు మరణించినట్లు నివేదికలు అందుతున్నాయి. టెహ్రాన్ వీధుల్లో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. భారత పౌరుల భద్రతే తమకు ప్రాధాన్యమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్‌లో ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది.
Follow Us