క‌త్తులు పంచిన హిందూ నేతల వీడియో వైర‌ల్.. 10 మంది అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా పెను దుమారం రేపుతోంది. బహిరంగంగా కత్తులు పంపిణీ చేస్తూ, సమాజంలో భయాందోళనలు సృష్టించేలా వ్యవహరించిన పది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
123661

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా పెను దుమారం రేపుతోంది. బహిరంగంగా కత్తులు పంపిణీ చేస్తూ, సమాజంలో భయాందోళనలు సృష్టించేలా వ్యవహరించిన పది మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి కఠిన చర్యలు తీసుకున్నారు.

డిసెంబర్ 29న ఘజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్ పరిధిలోని ఓ కార్యాలయంలో ఈ వింత ఘటన జరిగింది. 'హిందూ రక్షా దళ్' సంస్థకు చెందిన కార్యకర్తలు స్థానిక ప్రజలకు కత్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు పింకీ చౌదరి స్వయంగా పాల్గొని కత్తులను పంచిపెడుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. పదునైన కత్తులను చేతబూని చాలా మంది వ్యక్తులు వాటిని ప్రదర్శిస్తూ నినాదాలు చేయడం ఆ వీడియోలో కనిపించింది. వైరల్ వీడియోపై స్పందించిన ఘజియాబాద్ పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. షాలిమార్ గార్డెన్‌లోని సదరు కార్యాలయంపై దాడి చేసి, అక్కడి నుంచి 8 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు పది మందిని అరెస్ట్ చేయగా, మొత్తం 46 మందిపై కేసులు నమోదు చేశారు. కొత్తగా అమల్లోకి వచ్చిన BNSలోని పలు సెక్షన్ల కింద కేసులు బుక్ అయ్యాయి.

ఈ ఘటనపై విపక్షాలు యోగి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, బహిరంగంగా ఆయుధాలు పంపిణీ చేస్తున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని ఆరోపించాయి. సమాజంలో వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు. ప్రస్తుతం ఘజియాబాద్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ అతుల్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Advertisment
తాజా కథనాలు