తెలంగాణలో సక్సెస్.. హర్యానాలో ఫెయిల్.. కాంగ్రెస్ చేసిన బిగ్ మిస్టేక్ అదే!

హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలంగాణలో అగ్రనేతలందరినీ ఒకే తాటిపై నడిపించిన హస్తం పార్టీ.. హర్యానాలో మాత్రం విఫలమైందన్న టాక్ నడుస్తోంది. దీంతో గెలిచే అవకాశం ఉన్నా.. అధికారానికి దూరమైందన్న చర్చ సాగుతోంది.

TS Congress Bhatti Revanth rahul
New Update

హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. తమ అంచనాలు ఎక్కడ తలకిందులు అయ్యాయో తెలియక తలలు పట్టుకుంటున్నారు హస్తం నేతలు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి హర్యానాలో గెలుపుపై కాన్ఫిడెంట్ గా ఉంది కాంగ్రెస్. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ పార్టీదే గెలుపని తేల్చేశాయి. కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటి వరకు కూడా ఇదే ఊపు కనిపించింది. కానీ రౌండ్ రౌండ్ కూ అనూహ్యంగా దూసుకొచ్చింది బీజేపీ. 90 సీట్లకు గానూ 48 సీట్లలో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. విజయంపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ 37 సీట్లకు పరిమితమైంది. అధికారానికి 9 సీట్ల దూరంలో ఆగిపోయింది. అంతర్గత కుమ్ములాటలే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణమన్న విశ్లేషణ సాగుతోంది. మాజీ సీఎం భూపింద్ర సింగ్ హుడా, ఎంపీ కుమారి సెల్జా వర్గాల మధ్య విభేదాలు పార్టీకి నష్టం చేశాయన్న చర్చ నడుస్తోంది. ఓ దశలో కుమారి సల్జా ప్రచారానికి కూడా దూరంగా ఉండడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపించింది. సమస్య పరిష్కారానికి రాహుల్ గాంధీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఓ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ఆమెను వేదికపైకి స్వయంగా తీసుకొచ్చారు. భూపింద్ర హుడాతో షేక్ హ్యాండ్ కూడా ఇప్పించారు. అయినా వారి మధ్య ఆధిప్యత పోరు ఆగలేదు. 

నష్టం చేసిన హుడా అనుచరుడి వ్యాఖ్యలు..

సీఎం పదవికి తానే పోటీదారురాలని అని కుమారి సెల్జా ప్రకటించడం.. మరో వైపు ఎన్నికల వేళ కుమారి సెల్జాపై భూపింద్ర సింగ్ హుడా అనుచరుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా పార్టీకి నష్టం చేశాయి. మరో వైపు అంసాధ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా భరిలో ఉన్న షంషేర్ గోగి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీ విజయావకాశాలను దెబ్బతీశాయన్న విశ్లేషణలు ఉన్నాయి. హర్యానాలో కాంగ్రెస్ గెలిస్తే ముందుగా తన ఇంటిని నింపుకుంటానని ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీకి ఆయుధంగా మారాయి.హర్యానాలో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఎంత అవినీతి జరుగుతుందో చెప్పడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం అంటూ కమలనాథులు తీవ్రంగా ప్రచారం చేశారు. 

సీనియర్లు అంతా ఒకే తాటిపైకి..

తెలంగాణలో మాదిరిగా హర్యానాలోనూ సీఎం అభ్యర్థి ఎవరనేది ముందుగా ప్రకటించలేదు కాంగ్రెస్. కానీ ఇక్కడ నేతలందరినీ ఒక్కతాటిపై నడిపించే అంశంలో మాత్రం సక్సెస్ అయ్యింది.  ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు రేవంత్ అంటేనే భగ్గుమన్న సీనియర్లను సైలెంట్ చేయడంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయవంతం అయ్యింది. కొందరు నేతలను నియోజకవర్గాలను కూడా దాటి బయటకు రానివ్వలేదు. రేవంత్ రెడ్డి కూడా అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డి లాంటి అనుచరులకు కూడా టికెట్ ఇప్పించుకోలేకపోయారు.

అక్కడ ఆయన ప్రత్యర్థుల మాటే నెగ్గినా.. ఆయన ఓర్చుకున్నారు. ఈ విషయంలోనూ హైకమాండ్ రేవంత్ ను ఒప్పించగలిగింది. కానీ, హర్యానాలో మాత్రం భూపింద్ర సింగ్ హుడా చెప్పిన వారికే టికెట్లు దక్కాయి. దీంతో ఇతర సీనియర్లు భగ్గుమన్నారు. అభ్యర్థులకు వారు సహాయ నిరాకరణ చేశారు. ముఖ్యనేతలు కుమారి సెల్జా, రణ్‌దీప్ సూర్జేవాలా బహిరంగంగానే ఈ అంశంపై విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యనేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి నడిపించినట్లుగానే.. హర్యానాలోనూ చేస్తే కాంగ్రెస్ సక్సెస్ అయ్యే అవకాశం ఉండేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

#rahul-gandhi #revanth-reddy #haryana election 2024 #haryana election #Congress Results In Haryana Elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe