Gotmar ritual: రాళ్లతో కొట్టుకోవడమే అక్కడి ఆచారం.. 2 గ్రామాల్లో 934 మందికి గాయాలు

గోట్మార్‌ అంటే మరాఠీ భాషలో "రాళ్లు రువ్వుకోవడం" అని అర్థం. ఈ ఉత్సవం పేరుకు తగ్గట్టే రెండు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లను విసురుకుంటారు. వేలాది మంది ప్రజల రక్తానికి సాక్ష్యంగా నిలుస్తూ 400 సంవత్సరాలుగా వస్తున్న ఆచారం ఇది.

New Update
Gotmar Ritual In Madhya Pradesh

Gotmar Ritual In Madhya Pradesh

గోట్మార్‌ అంటే మరాఠీ భాషలో "రాళ్లు రువ్వుకోవడం" అని అర్థం. ఈ ఉత్సవం పేరుకు తగ్గట్టే రెండు గ్రామాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లను విసురుకుంటారు. వేలాది మంది ప్రజల రక్తానికి సాక్ష్యంగా నిలుస్తూ 400 సంవత్సరాలుగా వస్తున్న ఆచారం ఇది. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవానికి వేలాది మంది హాజరవుతారు. ప్రమాదాలను నివారించడానికి పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అంబులెన్సులు, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచుతారు. ఈ ఆచారానికి ఓ ప్రేమ జంట కారణంగా చెప్పుకుంటారు. అసలు రాళ్లతో కొట్టుకోవడం ఆచారం ఏంటో ఇప్పుడు చూద్దాం..

పంధుర్న, సావర్గావ్

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జిల్లాలోని పంధుర్న, సావర్గావ్‌ గ్రామాల మధ్య ప్రవహించే జామ్ నది ఒడ్డున ప్రతి ఏటా జరిగే గోట్మార్‌ ఉత్సవం నిర్వహిస్తారు. భద్రపద అమావాస్య తరువాత వచ్చే పోలా పండుగ మరుసటి రోజున ఈ ప్రత్యేకమైన, ప్రమాదకరమైన ఉత్సవం జరుగుతుంది. ఇందులో రెండు గ్రామాల ప్రజలు రాళ్లు విసురుకుంటారు. ఈ ఉత్సవం ఆగస్ట్ 23 రోజు జరిగింది. ఇందులో శనివారం మధ్యాహ్నం నాటికి 934 మంది గాయపడగా, అందులో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వారిని నాగ్‌పూర్‌కు తరలించారు.

ఈ ఉత్సవంలో భాగంగా నది మధ్యలో ఒక పొడవాటి పలాష్ చెట్టును పాతుతారు. దాని పైన ఒక పసుపు జెండాను కడతారు. ఈ జెండాను పట్టుకోవడానికి రెండు గ్రామాల ప్రజలు నది ఒడ్డు నుంచి ఒకరిపై ఒకరు రాళ్లను విసురుకుంటూ ముందుకు సాగుతారు. ఎవరు జెండాను పట్టుకుంటే, ఆ గ్రామం విజయం సాధించినట్లు భావిస్తారు. ఈ ప్రక్రియలో అనేకమందికి తీవ్ర గాయాలవుతాయి. కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి క్రమం తప్పకుండా ఆచారంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో ఇప్పటివరకు 13 మంది మరణించారు. వందలాది మంది కళ్లు, కాళ్లు, చేతులు పోగొట్టుకుని దివ్యాంగులయ్యారు. అయినా ఈ ఉత్సవ నిర్వహణకు ఆదరణ పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఈ ఆచారం జరపడానికి ఒక కథ ప్రచారంలో ఉంది.

దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఉత్సవానికి ఒక విషాద ప్రేమకథ నేపథ్యంగా ఉందని స్థానికులు చెబుతారు. సావర్గావ్‌కు చెందిన ఓ యువతి, పంధుర్నకు చెందిన యువకుడు ప్రేమించుకొని, గ్రామం నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. వారు జామ్ నదిని దాటుతుండగా, సావర్గాం ప్రజలు వారిని వెంబడించి, వారిపై రాళ్లతో దాడి చేశారు. దీంతో ఇద్దరూ నదిలోనే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ఆ ప్రేమ జంట జ్ఞాపకార్థం ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

Advertisment
తాజా కథనాలు