/rtv/media/media_files/2025/07/27/rave-party-2025-07-27-20-58-44.jpg)
మహారాష్ట్రలోని పుణెలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రేవ్ పార్టీ దాడిలో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే అల్లుడు ప్రాంజల్ ఖేవాల్కర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిందరని కోర్టులో హాజరు పరచగా కోర్టు ఈ నెల 29వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీనిపై ఏక్‌నాథ్ ఖడ్సే స్పందించారు. వీటి వెనుక పోలీసుల దాడులు రాజకీయ ప్రేరేపితమై ఉండొచ్చని, దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి వర్గం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే భర్తనే ఈ ఏక్‌నాథ్ ఖడ్సే.
డ్రగ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో
ఆదివారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో పూణే పోలీసులు ఒక ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో డ్రగ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో దాడులు చేశారు.సంఘటనా స్థలం నుండి 2.7 గ్రాముల కొకైన్ , 70 గ్రాముల గంజాయి, హుక్కా పాట్, వివిధ రకాల హుక్కా ఫ్లేవర్లు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అరెస్టయిన వారిలో ప్రాంజల్ ఖేవాల్కర్‌తో పాటు నిఖిల్ పోప్టానీ,సమీర్ సయ్యద్, శ్రీపాద్ యాదవ్, సచిన్ భోంబే, ఈషా సింగ్, ప్రాచీ శర్మ ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. వీరిపై నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేశామన్నారు. నిందితులను వైద్య పరీక్షల కోసం తరలించామని.. ఇంకా నివేదికలు రావాల్సి ఉందన్నారు.
ఈ పరిణామంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ తాను ఈ రోజు వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నందున ఈ విషయం గురించి తనకు ఇంకా సమాచారం అందించలేదని అన్నారు.ఈ విషయం గురించి నేను మీడియాలోనే చూశానని తెలిపారు. సరైన సమాచారం అందిన తర్వాత ఈ విషయంపై కచ్చితంగా మాట్లాడుతానని అన్నారు. ప్రాథమికంగా చూస్తే ఆ ప్రదేశంలో నేరం జరిగినట్లు కనబడుతోందని సీఎం అన్నారు.