/rtv/media/media_files/2026/01/26/fotojet-13-2026-01-26-20-10-50.jpg)
CRPF Simran Bala
CRPF Simran Bala : సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా చరిత్ర సృష్టించారు. పారామిలిటరీ దళానికి చెందిన పురుషుల బృందానికి ఆమె నాయకత్వం వహించి, చరిత్ర సృష్టించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పురుష సైనికులతో కూడిన దళానికి ఆమె నాయకత్వం వహించారు. పారామిలిటరీ బలగాల చరిత్రలో ఓ మహిళ.. పూర్తిగా పురుష సైనికుల బృందానికి సారథ్యం వహించడం ఇదే మొదటిసారి. ఈ అరుదైన అవకాశం ఆమెకు లభించింది. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన ఈ కవాతులో 26 ఏళ్ల సిమ్రాన్ బాలా 147 మంది సైనికులతో కూడిన దళానికి ముందుండి నడిపించారు.
దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళమైన సీఆర్పీఎఫ్ కు చెందిన ఈ బృందం కర్తవ్యపథ్‌లో ఫోర్స్ బ్యాండ్ వాయించిన 'దేశ్ కే హమ్ హై రక్షక్' అనే గీతాన్ని ఆలపిస్తూ పరేడ్ లో పాల్గొంది. మహిళా సీఆర్పీఎఫ్ అధికారులు గతంలో కవాతులకు సారథ్యం వహించినా, పూర్తిగా పురుష సైనికులతో కూడిన దళానికి ఒక మహిళ నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. ఈ పరేడ్ మొత్తానికీ సిమ్రన్ బాలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళా శక్తికి నిలువుటద్దం అయ్యారు.
పాకిస్థాన్ బోర్డర్ లో పుట్టి..
జమ్మూకశ్మీర్ పాక్ సరిహద్దుకు 11 కిలోమీటర్ల దూరంలోని రాజౌరీ జిల్లాకు నౌషెరా గ్రామం సిమ్రన్ బాలా స్వగ్రామం. ముగ్గురు తోబుట్టువుల్లో సిమ్రాన్ చిన్నవాళ్లు.అత్యంత సమస్యాత్మక, సున్నితమైన నౌషేరా పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ రేఖ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ సరిహద్దు కాల్పులు సర్వ సాధారణం. సరిహద్దుల్లో కాల్పులు జరిగిన ప్రతిసారి ఆమె గ్రామం ఖాళీ అయ్యేది. అక్కడి వారిని జవాన్లు సురక్షిత ప్రాంతాలకు తరలించేవాళ్లు. అటువంటి చోటి నుంచి వచ్చారు సిమ్రన్ బాలా. సిమ్రన్ జమ్మూలోని గాంధీనగర్‌లో ఉన్న ప్రభుత్వ మహిళా కళాశాలలో చదివారు. అక్కడ రాజకీయ శాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు. ఏడాది కిందటే ఏప్రిల్ 2025లో సీఆర్పీఎఫ్ సీఆర్‌పీఎఫ్ దళంలో చేరారు. రాజౌరీ జిల్లా నుండి అధికారి స్థాయి ర్యాంకులో ఈ అతిపెద్ద పారామిలిటరీ దళంలో చేరిన మొదటి మహిళగా సిమ్రాన్ బాలా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆమె ఛత్తీస్‌గఢ్‌లోని ‘బస్తారియా’ బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. సిమ్రన్ తండ్రి, తాత కూడా ఆర్మీలో పని చేశారు.
దాదాపు 3.25 లక్షల జవాన్ల సామర్థ్యం ఉన్న సీఆర్పీఎఫ్.. దేశంలోనే అత్యంత కీలక అంతర్గత భద్రతా దళంగా పేరుగాంచింది. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు, జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక దాడులు, ఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటు వ్యతిరేక విధులు వంటివి ఈ దళం ప్రధాన కార్యకలాపాల్లో ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు అక్కడి పరిస్థితులను నియంత్రించాల్సిన బాధ్యత సీఆర్పీఎఫ్ దే. అటువంటి దళానికి రిపబ్లిక్ డే పరేడ్ లో నాయకత్వాన్ని వహించడం పట్ల సిమ్రన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మొదటిసారి.. ‘సూర్యాస్త్ర’ ప్రదర్శన
పరేడ్‌లో మన దేశ వివిధ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలో భాగంగా 300 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే ‘సూర్యాస్త్ర’ రాకెట్ లాంఛర్‌ను కూడా ప్రదర్శించారు. కాగా దీన్ని ప్రదర్శించడం ఇదే మొదటిసారి. ఈ ‘సూర్యాస్త్ర’ బృందానికి భారత సైన్యంలోని ఆర్టిలరీ రెజిమెంట్ అధికారిణి లెఫ్టినెంట్ మెహక్ భాటి నాయకత్వం వహించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ.. పరేడ్‌లో ‘సూర్యాస్త్ర’ బృందాన్ని లీడ్ చేయడం గర్వంగా ఉందన్నారు. ఈ రాకెట్ లాంచర్ వ్యవస్థను భారత సైన్యంలోకి ప్రవేశపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. ఇది ఒకే లాంచర్ నుంచి బహుళ క్యాలిబర్‌ల రాకెట్‌లను ప్రయోగించగలదని, దీర్ఘ-శ్రేణి దాడుల సామర్థ్యాన్ని పెంచుతుందని అధికారులు తెలిపారు. మెహక్ భాటి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె నానమ్మ, తండ్రి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండటం గమనార్హం
Follow Us