IndiGo flights: ఇండిగోకు DGCA బిగ్ షాక్.. రూ.22 కోట్ల భారీ జరిమానా

సివిల్ ఏవియేషన్ సంస్థ ఇండిగోకు గట్టి షాక్ తగిలింది. 2025 డిసెంబరు మొదటి వారంలో సంభవించిన విమాన సర్వీసుల సంక్షోభంపై విచారణ జరిపిన డీజీసీఏ, శనివారం ఆ సంస్థపై రూ. 22.20 కోట్ల జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

New Update
Indigo Flight

Indigo Flight

సివిల్ ఏవియేషన్ సంస్థ ఇండిగోకు గట్టి షాక్ తగిలింది. 2025 డిసెంబరు మొదటి వారంలో సంభవించిన విమాన సర్వీసుల సంక్షోభంపై విచారణ జరిపిన డీజీసీఏ, శనివారం ఆ సంస్థపై రూ. 22.20 కోట్ల జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత డిసెంబరు 3 నుండి 5 మధ్య ఇండిగో ఏకంగా 2,507 విమానాలను రద్దు చేయగా, 1,852 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదేశాల మేరకు డీజీసీఏ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ జరిపిన విచారణలో ఇండిగో మేనేజ్‌మెంట్ వైఫల్యాలు బయటపడ్డాయి. నవంబర్ నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ నిబంధనలను పాటించడంలో ఇండిగో ఫెయిల్ అయ్యింది. అందుబాటులో ఉన్న సిబ్బంది కంటే ఎక్కువ విమానాలను షెడ్యూల్ చేయడం వల్ల వ్యవస్థ కుప్పకూలింది. సిబ్బంది విధుల కేటాయింపులో వాడే సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఉండటం వల్ల సంక్షోభం తీవ్రమైంది.

డీజీసీఏ విధించిన రూ. 22.20 కోట్ల జరిమానాలో.. 68 రోజుల పాటు నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ప్రతిరోజూ రూ.30 లక్షల చొప్పున (మొత్తం రూ. 20.40 కోట్లు) జరిమానా పడింది. దీనికి అదనంగా వ్యవస్థాగత లోపాల కోసం మరో రూ.1.80 కోట్లు వన్-టైమ్ పెనాల్టీగా విధించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడటానికి రూ. 50 కోట్ల బ్యాంక్ గ్యారంటీని కూడా సమర్పించాలని ఆదేశించింది. ఇండిగో సీఈఓ సహా ఉన్నతాధికారులకు డీజీసీఏ హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

Advertisment
తాజా కథనాలు