PM Modi: అర్బన్ నక్సల్స్‌తో కాంగ్రెస్ పార్టీకి సన్నిహిత సంబంధాలున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది అర్బన్ నక్సల్స్ మూఠాలేనంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు పేదలను దోచుకోవడం తప్పితే దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచనే లేదన్నారు. దేశాన్ని విభజించాలని చూస్తున్న ప్రమాద కర పార్టీ ఎజెండాను తిప్పికొట్టడానికి దేశప్రజలంతా ఏకం కావాలని మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు.
భారత్‌కు వ్యతిరేక శక్తులతో దోస్తీ..
ఈ మేరకు ఆదివారం మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. 'మనమంతా ఒక్కటికావాలని చూస్తే కాంగ్రెస్ దేశాన్ని విభజించాలని చూస్తోంది. భారత్‌కు వ్యతిరేక శక్తులైన అర్బన్ నక్సల్స్ తో కాంగ్రెస్ సన్నిహితంగా ఉంటుంది. ఆ పార్టీ ఆలోచనాతీరు విదేశీయుల్లా ఉంటుంది. దళితులు, బీసీలు, గిరిజనులను కాంగ్రెస్ చిన్నచూపు చూస్తోంది. ఎప్పటికే వారి కుటుంబమే దేశాన్ని పాలించాలని చూస్తోంది. యువతను మద్యం మత్తులో ముంచి దాని ద్వారా వచ్చిన సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని భావిస్తోంది. ఇటీవల ఢిల్లీలో బయటపడ్డ రూ.వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాల వెనుక ఓ కాంగ్రెస్ నేప్రధాన సూత్రధారిగా అనుమానాలున్నాయంటూ అనుమానం వ్యక్తం చేశారు.
రూ.50,000 కోట్ల పనులకు శంకుస్థాపనలు..
అలాగే మహారాష్ట్రలో వివిధ రంగాలకు చెందిన రూ.50,000 కోట్ల పనులకు మోదీ శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి సౌర్ కృషి వాహిని యోజన 2.0 కింద 19 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 5 సౌరవిద్యుత్తు పార్క్‌లను ప్రారంభించారు. బంజారా విరాసత్ మ్యూజియాన్ని ఆరభించి, స్థానిక జగదాంబ మాత ఆలయంలో మోదీ పూజలు చేశారు. ముంబయిలో మొట్టమొదటి భూగర్భ మెట్రోరైలు మార్గాన్ని మోదీ ప్రారంభించారు. బాంద్రాకుర్లా కాంప్లెక్స్ నుంచి శాంతాక్రూజ్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించి, ప్రయాణికులతో, నిర్మాణపనుల్లో పాల్గొన్న కూలీలతో, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులైన మహిళలతో ముచ్చటించారు. అనంతరం సంత్ సేవాలాల్ మహారాజ్ సమాధి వద్దకు వెళ్లి సంప్రదాయ ఢంకా మోగించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 18వ విడత కింద 9.5 కోట్లమంది రైతులకు సుమారు రూ.20,000 కోట్లను ప్రధాని విడుదల చేశారు.