/rtv/media/media_files/2025/11/25/fotojet-2025-11-25t101249683-2025-11-25-10-13-14.jpg)
Chief Justice of the Supreme Court Justice Surya Kant
CJI Justice Surya Kant: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సూర్యకాంత్ హిందీలో.. దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి చేపట్టిన తొలి హరియాణా వాసిగా సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) వంటి అంశాల్లో పలు కీలక తీర్పులను వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉన్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకూ సూర్యకాంత్ సీజేఐగా కొనసాగుతారు.
న్యాయవాద నేపథ్యం
జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణాలోని హిస్సార్ జిల్లా పెటావర్‌లోని మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. లా డిగ్రీ 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. మొదటిసారి హిస్సార్‌లోని జిల్లా కోర్టులో 1984 న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్, హరియాణా కోర్టుకు మారారు. అక్కడే రాజ్యాంగం, సర్వీసు, క్రిమినల్ కేసులు వాదించారు. అత్యంత పిన్న వయస్సులోనే హరియాణా అడ్వకేట్ జనరల్‌గా 2000 జులై 7న నియమితులై సంచలనం సృష్టించారు. 2004 జనవరి 9న పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితుడయ్యారు. అప్పటి వరకు నియమితులయ్యేంతవరకూ కూడా ఆయన అడ్వకేట్ జనరల్‌గా సేవలందించారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/11/25/fotojet-2025-11-25t101353461-2025-11-25-10-15-33.jpg)
అలాగే న్యాయమూర్తి హోదాలో 2007 నుంచి 2011 వరకు జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ పాలక మండలి సభ్యుడిగా కూడా సూర్యకాంత్ పని చేశారు. న్యాయమూర్తిగా పని చేస్తూనే న్యాయశాస్త్రంలో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. 2018 అక్టోబరు 5న సూర్యాకాంత్ హిమాచల్ ప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం 2019 మే 24న ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2025 మే 14 నుంచి నల్సా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. గవర్నర్లవద్ద బిల్లుల పెండింగ్‌పై ఇటీవల తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోనూ జస్టిస్ సూర్యకాంత్ సభ్యుడిగా ఉండటం విశేషం. .బ్రిటీష్ కాలంనాటి దేశద్రోహ చట్టాన్ని అబేయన్స్‌లో పెట్టిన కీలక తీర్పులోనూ ఆయన భాగస్వామి. సుప్రీం కోర్టుతోపాటు అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లలో 30శాతం పదవులను మహిళలకు కేటాయించాలని ఆదేశాలిచ్చిన న్యాయమూర్తుల్లో జస్టిస్ సూర్యకాంత్ కూడా సభ్యుడిగా ఉన్నారు. సైనిక దళాల్లో ఏకరూప పెన్షన్ విధానాన్ని సమర్థించిన ధర్మాసనంలోనూ ఆయన సభ్యుడు.
కాగా సూర్యకాంత్ సుప్రీంకోర్టులో ఉన్న 2 కొలీజియాలకు నేతృత్వం వహిస్తారు. ఐదుగురు సభ్యుల కొలీజియం.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను చేపడుతుంది. ముగ్గురు సభ్యుల కొలీజియం.. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాన్ని చేపడుతుంది. ఈ రెండింటికి ఆయన నాయకత్వం వహిస్తారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/11/25/fotojet-2025-11-25t101502017-2025-11-25-10-15-58.jpg)
తొలిరోజే కీలక నిర్ణయం
సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ తొలిరోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యవసరంగా విచారించాల్సిన కేసులపై విజ్ఞప్తులను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించారు. ధర్మాసనం ఎదుట మౌఖిక అభ్యర్థనలను అనుమతించబోమని సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ మరణ శిక్ష, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన కేసుల్లోనే నేరుగా ప్రస్తావించడానికి అనుమతిస్తామని సూర్యకాంత్ తేల్చి చెప్పారు. తొలిరోజు ఆయన రెండు గంటలపాటు జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనంలో గడిపారు. ఈ సమయంలో 17 కేసులను విచారించారు. ఓ ప్రైవేటు సంస్థపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వేసిన కేసులో తొలి తీర్పు ఇచ్చారు.
లాంతర్ల కింద చదువు
బాల్యంలో కిరోసిన్ లాంతర్ల కింద చదువుకునే రోజుల్లో సీజేఐ అవుతానని ఎన్నడూ అనుకోలేదు. అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ అంటే ఏంటి.. అందులో న్యాయమూర్తి భూమిక ఎలా ఉంటుందన్నది ఆ రోజుల్లో తెలిసేది కాదన్నారు. ‘నేను అత్యంత పిన్న వయసులోనే అడ్వకేట్ జనరల్ అయ్యాను. 40 ఏళ్లకే నా పేరును హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేశారు. అయితే 41 ఏళ్లు నిండాకే ఆ పదవికి ఎంపికయ్యాను అని ఆయన వివరించారు. నేను మా కుటుంబాల్లో తొలి తరం న్యాయవాదిని. న్యాయమూర్తుల పిల్లలే న్యాయమూర్తులవుతారన్న విమర్శను నేనూ విన్నాను’ అని ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్.. స్వగ్రామంలో తాను చదువుకున్న పాఠశాల, సేద్యం చేసిన పొలాలను టీవీ ఛానల్ ‘ఎన్‌డీటీవీ’కి చూపుతూ ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘న్యాయశాస్త్రం చదివిన తర్వాత సాధన ప్రారంభించినప్పుడు హిస్సార్ జిల్లా కోర్టులో ఓ కేసు వాదించే అవకాశాన్ని సీనియర్ న్యాయవాది ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చారు. ఆ కేసు వాదించిన తర్వాత అప్పటి జిల్లా జడ్జి.. సీనియర్ న్యాయవాదులందరినీ పిలిచారు. ఈ యువకుడిని హైకోర్టుకు వెళ్లేలా ప్రేరణ ఇవ్వాలని సూచించారు. దీంతో ఓ సీనియర్ న్యాయవాది నన్ను చండీగఢ్ తీసుకెళ్లి అక్కడ ఓ సీనియర్ న్యాయవాది వద్ద చేర్చించారు. త్వరగా అక్కడ నిలదొక్కుకున్నాను. ఐదారేళ్లలోనే రాష్ట్రం మొత్తం నన్ను ఓ విజయవంతమైన న్యాయవాదిగా గుర్తించింది’ అని వివరించారు. ఆంగ్లంలో మాట్లాడే పెద్దలకే సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందన్న దుష్ప్రచారం సరి కాదన్నారు. ‘ఏ కేసులో తీర్పు ఇచ్చినా అది ఒకరికి అనుకూలంగా, మరొకరికి వ్యతిరేకంగా ఉంటుంది. వ్యతిరేక తీర్పు పొందినవారు న్యాయమూర్తులపట్ల ఆగ్రహంగా ఉండటం సహజం. అందువల్ల అలాంటి ప్రజలు తమపట్ల ఆగ్రహంగా ఉన్నారని న్యాయమూర్తి భావించాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.
Follow Us