BREAKING: విజయ్‌ దళపతికి బిగ్ షాక్.. CBI నోటీసులు

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న కరూర్ తొక్కిసలాట కేసులో CBI విచారణ వేగవంతమైంది. ఈ విషాద ఘటనకు సంబంధించి TVK అధినేత, నటుడు విజయ్‌కు సీబీఐ నేడు (జనవరి 6) నోటీసులు జారీ చేసింది. సీబీఐ విచారణలో అసలు బాధ్యులెవరో తేలాల్సి ఉంది.

New Update
Madras High Court dismisses TVK Party petition for CBI probe

Madras High Court dismisses TVK Party petition for CBI probe

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న కరూర్ తొక్కిసలాట కేసులో CBI విచారణ వేగవంతమైంది. ఈ విషాద ఘటనకు సంబంధించి TVK అధినేత, నటుడు విజయ్‌కు సీబీఐ నేడు (జనవరి 6) నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 27, 2025న జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కరూర్‌లోని వేలుస్వామిపురంలో విజయ్ తన రాజకీయ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించారు. సుమారు 10 వేల మంది వస్తారని అనుమతి తీసుకోగా, దాదాపు 30 వేల మందికి పైగా ఫ్యాన్స్ తరలివచ్చారు. విజయ్ వేదికపైకి రావడంలో దాదాపు 7 గంటల ఆలస్యం కావడం, సరైన బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో జనం ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో మహిళలు, చిన్నారులు సహా 41 మంది మరణించారు.

సీబీఐ దర్యాప్తు 

ఈ కేసును తొలుత రాష్ట్ర పోలీసులు విచారిస్తుండగా బాధితులు, టీవీకే నేతలు నిష్పక్షపాత విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ 2025లో సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ, మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించింది. మంగళవారం సీబీఐ విజయ్‌కు నోటీసులు పంపి విచారణకు హాజరుకావాలని కోరింది. ర్యాలీ నిర్వహణలో జరిగిన లోపాలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనపై ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, జాయింట్ సెక్రటరీలను సీబీఐ అధికారులు ఢిల్లీలో విచారించారు. పార్టీ తరఫున ఇప్పటికే కొన్ని వీడియో ఆధారాలను సీబీఐకి సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని టీవీకే ఆరోపిస్తోంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతుల కుటుంబాలకు విజయ్ ఇప్పటికే రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకుల ప్రాణాలతో ఆడుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సీబీఐ విచారణలో అసలు బాధ్యులెవరో తేలాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు