Bribery case: ఆర్మీలో అవినీతి తిమింగళం.. లెఫ్టినెంట్ కల్నల్ ఇంట్లో భారీగా కరెన్సీ కట్టలు

ఇండియన్ ఆర్మీలో అవినీతి తిమింగళం బయటపడింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్‌లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ ముడుపుల కేసులో సిబిఐకి చిక్కారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్‌లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.

New Update
col Arrest

ఇండియన్ ఆర్మీలో ఓ అవినీతి తిమింగళం బయటపడింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్‌లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ కల్నల్ ముడుపుల కేసులో సిబిఐకి చిక్కారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్‌లో అధికారులు భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు. లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్‌లో 'డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్' (ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఎక్స్‌పోర్ట్స్)గా పనిచేస్తున్నారు.

బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ రక్షణ తయారీ సంస్థ నుండి రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నిందితుడి ఢిల్లీ నివాసంలో సోదాలు నిర్వహించిన సిబిఐ అధికారులు సుమారు రూ.2.23 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయన భార్య (కల్నల్ కాజల్ బాలి) నివాసం ఉన్న రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో మరో రూ.10 లక్షలు లభించాయి. మొత్తంగా ఈ కేసులో రూ.2.36 కోట్ల వరకు నగదును సిబిఐ సీజ్ చేసింది.

రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ, ఎగుమతులకు సంబంధించి కొన్ని ప్రైవేట్ కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేందుకు లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ శర్మ క్రమం తప్పకుండా లంచాలు తీసుకుంటున్నట్లు సిబిఐకి సమాచారం అందింది. డిసెంబర్ 18న వినోద్ కుమార్ అనే వ్యక్తి ద్వారా బెంగళూరు కంపెనీ తరపున రూ.3 లక్షల లంచం దీపక్ శర్మకు అందింది. విశ్వసనీయ సమాచారంతో నిఘా పెట్టిన సిబిఐ అధికారులు, శర్మతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన వినోద్ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు.

ఈ అవినీతి నెట్‌వర్క్‌లో దీపక్ శర్మ భార్య, శ్రీ గంగానగర్‌లో 16 ఇన్‌ఫాంట్రీ డివిజన్ ఆర్డినెన్స్ యూనిట్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కల్నల్ కాజల్ బాలి పేరును కూడా సిబిఐ FIRలో చేర్చింది. దుబాయ్‌కి చెందిన ఒక కంపెనీ ప్రతినిధులతో కలిసి వీరు కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, జమ్మూ, శ్రీ గంగానగర్ వంటి పలు ప్రాంతాల్లో సిబిఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో నగదుతో పాటు అనేక కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు నిందితులకు డిసెంబర్ 23 వరకు సిబిఐ కస్టడీ విధించింది. రక్షణ శాఖ వంటి కీలక విభాగంలో ఇలాంటి భారీ కుంభకోణం బయటపడటం సంచలనం సృష్టించింది.

Advertisment
తాజా కథనాలు