Haryana Elections: హర్యానా ఎన్నికల్లో బీజేపీకి ఈసారి షాక్ తప్పదా ?

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి.. ఇండియా కూటమి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Modi and Rahul
New Update

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లాంటి బీజేపీకి 370 సీట్లు.. మొత్తం ఎన్డీయే కూటమికి 400 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత బీజీపీకి 240 మాత్రమే సీట్లు వచ్చాయి. మొత్తంగా ఎన్డీయే కూటమి 293 సీట్లు సాధించింది. చివరికి బీజేపీ ఎన్డీయే కూటమి పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియా కూటమి 234 సీట్లు సాధించి ఎన్డీయేకు పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో గత పదేళ్లుగా కేంద్రంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభావం తగ్గిపోతుందని.. ఇండియా కూటమి ప్రభావం పెరుగుతోందని నెటీజన్లు భావిస్తున్నారు. 

మరికొన్ని రోజుల్లో జమ్మూ కశ్మీర్‌, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌.. బీజేపీకి షాక్‌ ఇస్తుందా ? లేదా ? అనే దానిపై ఆసక్తి నెలకొంది. హర్యానాలో 2018లో ఏర్పాటైన జన్‌నాయక్ జనతా పార్టీ (JJP) ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పార్టీగా మారుతోంది. 2019లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడిన ఈ పార్టీ 10 సీట్లు దక్కించుకుంది. కానీ ఎన్నికల తర్వాత బీజేపీతో చేతులు కలిపింది. దీంతో ఎన్డీయే కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 58.2 శాతం ఓట్లు రాగా.. 2024లో మాత్రం 46.11 శాతానికి పడిపోయింది. ఇండియా కూటమి బీజేపీ కన్నా మెరుగైన ఓటింగ్‌ శాతం సాధించింది.

Also Read: ఈ సారే… ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’

హర్యానాలో 10 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అందులో తొమ్మిది స్థానాల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్‌కు 43.67 శాతం ఓటింగ్ రాగా.. ఒక్క స్థానంలో నిలబడ్డ ఆమ్‌ ఆద్మీ పార్టీకి 3.34 ఓటింగ్ శాతం వచ్చింది. మొత్తంగా ఇండియా కూటమి 47.61 ఓటింగ్ శాతం సాధించింది. దీన్ని బట్టి చూస్తే.. ఎన్డీయే కూటమికి ఓటింగ్ శాతం తగ్గింది. విపక్ష పార్టీలకు ఓటింగ్ శాతం పెరిగింది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ పడే అవకాశాలు కనిపిస్తు్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి ఎన్నికలు జాత్‌ వర్సెస్‌ నాన్‌ జాత్‌ కమ్యూనిటీ వర్గాల మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని అంచనా వేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్‌ నేతలైన భూపేందర్ సింగ్‌ హుడా, ఉదయ్‌ భాన్‌.. అగ్నివీర్‌ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, వ్యవసాయ సమస్యలు, పేపర్‌ లీక్‌లు వంటి ఘటనలను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్తున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉదయ్‌ బాన్‌ కాంగ్రెస్‌ స్టేట్‌ యూనిట్‌ను నడిపిస్తున్నారు. మరోవైపు భూపేందర్ హుడా.. ప్రజలకు 300 యూనిట్ల ఉచిత కరెంట్, వృద్ధులకు రూ.6 వేల పెన్షన్ లాంటి పథకాలు అందజేస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో జరిగినట్లే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి షాక్ ఇచ్చే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉండగా.. హర్యానాలో అక్టోబర్‌ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరీ ఈసారి అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారో తెలియాలంటే మరికొన్ని రోజుల పాటు వేచి చూడాల్సిందే.

#telugu-news #national-news #haryana-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe