/rtv/media/media_files/2025/06/13/xVQTeWvvTJnyH8YiazyL.jpg)
Ahmedabad Plane Crash, Pahalgam Terror Attack, RCB Victory Parade Incidents
ప్రాణం ఎంతో విలువైనది. అది ఎప్పుడు, ఎలా పోతుందో ఎవ్వరం చెప్పలేం. ఆ సమయానికి సంతోషంగా ఉండే ప్రాణాలు.. క్షణాల్లోనే గాల్లో కలిసిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అందమైన పర్యాటక ప్రాంతాలకు వెళ్లిన టూరిస్టులపై కాల్పులు, ఎన్నో ఏళ్ల కళ నెరవేరిన తర్వాత ఏర్పాటు చేసిన విక్టరీ పరేడ్‌లో తొక్కిసలాట, మరెన్నో ఆశలు, ఆశయాలతో ప్రయాణిస్తున్న ప్రయాణికుల విమానం బ్లాస్ట్ కావడం, మెడికల్ కాలేజీ హాస్టల్‌లో డాక్టర్లు భోజనం చేస్తుండగా విమానం క్రాష్ అయి పడటం. ఇలా ఈ మధ్య చాలా విషాదకరమైన ఇన్సిడెంట్‌లు జరిగాయి.
పహల్గాంలో కాల్పులు
అందమైన లోకేషన్లకు జమ్ము కశ్మీర్ బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పహల్గాం ప్రాంతం మినీ స్విట్జర్లాండ్‌గా పేరు గాంచింది. రోజుకు కొన్ని వేల మంది పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. అలా ఈ అందమైన ప్రదేశాలను చుట్టేందుకు ఎంతో సంతోషంతో వచ్చిన కుటుంబాలు ఉగ్రవాదుల చేతుల్లో బలైపోయాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో అమాయకులపై జరిగిన ఉగ్రవాదుల అటాక్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. పేరు, మతం అడిగి మరీ.. అమాయకులను హతమార్చారు. ఈ కాల్పుల్లో 26 మంది మరణించారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లినవారు, కొత్తగా పెళ్లైన జంటలు, ఉద్యోగస్తులు.. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక అందమైన ప్రదేశం.. వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా ప్రజలను కదిలించింది. ఈ విషాద ఘటనతో ప్రజలు విలవిల్లాడిపోయారు.
ఆర్సీబీ విక్టరీ పరేడ్
పహల్గాం అటాక్ విషాదం మరువక ముందే ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన ప్రజలను మరింత భావోద్వేగంలోకి నెట్టింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్సీబీ కళ నెరవేరింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ ప్రారంభమైన 18వ ఏటా ఆర్సీబీ జట్టు ట్రోఫీ గెలిచింది. ఇది దేశ వ్యాప్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. కానీ ఆ సంతోషం ఎంతో సమయం నిలవలేదు. కప్పు గెలిచిన సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ పరేడ్ నిర్వహించారు. అక్కడ ఫ్రీ పాస్ పెట్టడంతో లక్షల్లో అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. అదే సమయంలో తొక్కిసలాట జరిగి 11మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ వైపు పహల్గాం అటాక్‌ను మరిచిపోతున్న క్రమంలో ఈ తొక్కిసలాట ఘటన విషాదాన్ని నింపింది. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వెళ్లిన ఫ్యాన్స్.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం
ఆర్సీబీ తొక్కిసలాట జరిగి కొద్ది రోజులు గడుస్తున్న తరుణంలో అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశంలో జరిగిన అతి భయంకరమైన ప్రమాదాల్లో ఈ ప్రమాదం ఒకటి. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయి దాదాపు 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇన్సిడెంట్‌లో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ ఊహించని పరిణామంతో వందల మంది ప్రాణాలు విడిచారు. నవ వరుడి కోసం వెళ్తున్న యువతి, పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న ఫ్యామిలీ, అప్పుడే ఫస్ట్ టైం విమాన ప్రయాణం చేస్తున్న వారు.. ఇలా చాలా మంది సంతోష క్షణాల్లో క్షణంలోనే గాల్లో కలిసిపోయాయి.
మెడికల్ కాలేజీ హాస్టల్‌లోని డాక్టర్లు
అహ్మదాబాద్ విమానం క్రాష్ అయి నేరుగా బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడింది. అప్పటికి ఆ హాస్టల్‌లో డాక్టర్లు భోజనం చేస్తున్నారు. మరికొందరు ఫ్యామిలీతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇంకొందరు పడుకున్నారు. ఆ సమయంలో విమానం నేరుగా వెళ్లి బ్లాస్ట్ కావడంతో 20 మంది డాక్టర్లు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇలా వరుస విషాదాలు ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఫ్యామిలీతో సంతోషంగా గడుపుదామని వెళ్లిన టూరిస్టులపై కాల్పులు జరిపి చంపడం, అభిమాన క్రికెటర్లను దగ్గరి నుంచి చూసి మురిసిపోదామని వెళ్లిన అభిమానులు మరణించడం, విమానంలో సేఫ్‌గా ఇంటికి చేరుకుంటామని ప్రయాణించిన ప్రయాణికులు గాల్లోనే కాలి బూడిదవడం, పోనీ ఎటు వెళ్లకుండా ఉందామా అంటే? హాస్టల్‌పై విమానం పడి డాక్టర్లు మృతి చెందడం. వీటన్నింటినీ చూస్తుంటే.. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలీదు అని సోషల్ మీడియాలో నెటిజన్లు రాసుకొస్తున్నారు.