womens world cup india : దశాబ్ధాల కల...ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ మనదే...

భారతీయ క్రికెట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది. మగవారి ఆటమాత్రమే. కానీ, అనేక ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ట్రోఫీని తొలిసారి టీమిండియా సగర్వంగా ముద్దాడింది. ఇది భారత మహిళల క్రికెట్‌కు ఒక మరిచిపోలేని భారీ విజయం.

New Update
FotoJet

womens world cup india

womens world cup india : భారతీయ క్రికెట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది. మగవారి ఆటమాత్రమే. అనేక దశాబ్ధాలుగా ఆడవారు కూడా క్రికెట్ లో రాణించడంతో పాటు, దేశ ప్రతిష్టను ఇనుమడింప జేస్తున్నప్పటికీ వారికి మనం అందిస్తున్నది అంతంత మాత్రం ప్రోత్సాహమే. కనీసం వారి ఆట చూడడానికి కూడా జనం మైదానానికి రాని పరిస్థితి వారికి మనం ఇస్తన్న మర్యాదను గుర్తు తెస్తోంది. అయినా దశాబ్ధాలుగా మహిళా క్రికెటర్లు తమదైన స్టైల్లో రాణిస్తున్నప్పటికీ వారికి ఇంకా సరైన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఇదిలా ఉండగా అనేక ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ట్రోఫీని తొలిసారి టీమిండియా సగర్వంగా ముద్దాడింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ.. వంటి ప్లేయర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి జట్టును విజయ తీరాలకు చేర్చడం గమనార్హం. ఇది భారత మహిళల క్రికెట్‌కు ఒక మరిచిపోలేని భారీ విజయం. భారత మహిళల స్వప్నం సాకారమైన వేళ. సౌతాఫ్రికాతో ఆఖరి పోరాటంలో చిరస్మరణీయ ప్రదర్శనతో సొంతగడ్డపై, వేలాదిమంది ప్రేక్షకుల మధ్య హర్మన్‌సేన ప్రపంచ కప్పును ముద్దాడడం మరిచిపోలేని కిక్కునిచ్చింది.

 
కాగా జట్టు విజయంలో షెఫాలీ వర్మ, దీప్తి శర్మ కీలకపాత్ర వహించారు. షెఫాలీ ఆశించినట్లే బ్యాటుతో చెలరేగిపోవడంతో పాటు బౌలింగ్ తోనూ మాయ చేసింది. ఇంకోవైపు దీప్తి అర్ధసెంచరీ చేయడమే కాకుండా అయిదు వికెట్లతో ప్రత్యర్థిని మట్టి కరిపించింది. స్మృతి, రిచాతో పాటు నిలకడైన ప్రదర్శనను కొనసాగించిన తెలుగమ్మాయి శ్రీచరణి ఫైనల్లోనూ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఫలితం దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో భారత మహిళల జట్టు.. మొట్టమొదటిసారి జగజ్జేతగా నిలిచింది.

షెఫాలీ, దీప్తి మాయజాలం

అనూహ్యంగా జట్టులోకి వచ్చి ఆశ్చర్య పరచడమే కాకుండా ఆల్‌రౌండర్ షోతో అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది షెఫాలీ.షెఫాలి తన వరుస ఓవర్లలో లుజ్, కాప్‌ను ఔట్‌ చేసి ప్రత్యర్థికి షాకిచ్చింది. అటు బ్యాట్‌తోనూ చెలరేగి ఆడిన షెఫాలీ(82).. భారత్‌కు శుభారంభాన్ని అందించింది. ఫైనల్లో షెఫాలి అద్భుత ఆరంభాన్నిచ్చినప్పటికీ ఆ తర్వాత ఆమె ఔటైపోయాక ఇన్నింగ్స్‌ కొంత ఇబ్బంది ఎదురైంది. సెమీస్‌లో తమ గొప్ప ఇన్నింగ్స్‌ తో రాణించిన ఆడిన జెమీమా, హర్మన్‌ విఫలమయ్యారు. ఆ సమయంలో దీప్తి శర్మ విలువైన అర్ధశతకంతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. టోర్నీలో ఇలాగే మరి కొన్ని మ్యాచ్‌ల్లోనూ దీప్తి విలువైన ఇన్నింగ్స్‌లు ఆడింది. మొత్తంగా 9 మ్యాచ్‌ల్లో 215 పరుగులు చేసింది. ఇక బంతితో ఏకంగా 5 వికెట్లు పడగొట్టింది.

కాగా, గత దశాబ్ధాలుగా ప్రపంచ కప్పును సాధించే క్రమంలో పోరాడిన ఝులన్ గోస్వామి, మిథాలీ రాజ్ వంటి దిగ్గజాల బాటలోనే పయనిస్తూ.. వారు కన్న కలను ప్రస్తుత టీమిండియా అమ్మాయిలను నిజం చేయడం గమనార్హం. సెమీ ఫైనల్‌లో బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్.. జట్టును ఈ స్థాయిలో నిలబెట్టిన కోచ్ అమోల్ మజుందార్..ఇలా ఎందరో కృషితో నేడు భారత మహిళల జట్టు ఐసీసీ ప్రపంచ కప్పును ముద్దాడింది.

Advertisment
తాజా కథనాలు