BIG BREAKING : పాక్ ISI ఉగ్రవాద కుట్ర భగ్నం..  ఎనిమిది మంది అరెస్ట్

దేశ రాజధానిలో భారీ విధ్వంసానికి పన్నాగం పన్నిన ఒక పెద్ద ఉగ్రవాద ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI, బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
pak (1)

దేశ రాజధానిలో భారీ విధ్వంసానికి పన్నాగం పన్నిన ఒక పెద్ద ఉగ్రవాద ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI, బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఎనిమిది మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం జరిగిన ఈ మెరుపు దాడిలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అందించిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఉన్న వివిధ గర్మెంట్ యూనిట్లలో పని చేస్తున్న ఆరుగురిని పోలీసులు పట్టుకున్నారు. వీరిని మిజానూర్ రెహమాన్, మొహమ్మద్ షాబత్, ఉమర్, మొహమ్మద్ లిటన్, మొహమ్మద్ షాహిద్, మొహమ్మద్ ఉజ్జల్ గా గుర్తించారు. వీరంతా బంగ్లాదేశ్ జాతీయులని, నకిలీ ఆధార్ కార్డులతో తమ గుర్తింపును దాచిపెట్టి అక్కడ నివాసం ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వీరితో పాటు పశ్చిమ బెంగాల్‌లో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదులు ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రాంతాలు, పురాతన కట్టడాలే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా చాందీ చౌక్ ఏరియాలోని ఒక ప్రముఖ దేవాలయం, ఎర్రకోట సమీప ప్రాంతాల్లో ఐఈడీ (IED) బాంబులతో పేలుళ్లు జరపాలని విదేశీ హ్యాండ్లర్లు వీరికి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఈ హెచ్చరికలతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన మరుసటి రోజే ఈ అరెస్టులు జరగడం గమనార్హం.

8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులు

నిందితుల వద్ద నుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని నిశితంగా పరిశీలిస్తే వీరి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? వీరికి నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయి? ఇంకా ఎంతమందితో వీరికి సంబంధాలు ఉన్నాయి? అనే విషయాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితులందరినీ తదుపరి విచారణ కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు.

ఈ ఆపరేషన్‌తో ఢిల్లీలో జరగాల్సిన ఒక పెద్ద ముప్పు తప్పిందని, సరిహద్దుల అవతల ఉన్న శక్తుల కుట్రలను తిప్పికొట్టడంలో ఇది పెద్ద విజయమని పోలీసులు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీ మెట్రో స్టేషన్లు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో కశ్మీర్ అంశానికి సంబంధించి రెచ్చగొట్టే పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారనే కోణంలో లోతుగా దర్యాప్తు చేపట్టిన స్పెషల్ సెల్ పోలీసులకు, తమిళనాడులో నక్కి ఉన్న ఈ నెట్‌వర్క్ గురించి సమాచారం అందింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా వస్తున్న పోస్టులను ట్రాక్ చేయడంతో ఈ ముఠా గుట్టు వీడింది.