నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన విషయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే.. ఈ దాడి వెనకు ఉన్నది టీడీపీ నేతలేనని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే.. సానుభూతి కోసమే ఈ దాడి వైసీపీ నేతలే చేయించుకున్నారంటూ టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా కూడా ఇదే తరహాలో జరిగిందంటూ ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందించారు. 'రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!' అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ దాడి వైసీపీ డ్రామా అంటూ ఆయన పరోక్షంగా కామెంట్స్ చేశారు.
జగన్ పై దాడి అంశంపై టీడీపీ, వైసీసీ సోషల్ మీడియాల్లో దుమారం రేగుతోంది. ఈ దాడి జగన్ ను హత్య చేసేందుకు టీడీపీ చేసిన కుట్రగా వైసీపీ సోషల్ మీడియా చెబుతుంటే.. డ్రామా అంటూ తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇరు పార్టీల మద్దతుదారులు సైతం సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు.