Nadendla Manohar Arrest: విశాఖలో జనసేన (Janasena) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర నేతలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ ఆందోళన చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సోషల్ మీడియాలో స్పందించారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నాదెండ్ల మనోహర్, జనసేన నేతల అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా చేసిన నియంత పాలనకు చరమగీతం పాడుదామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు WhyAPHatesJagan అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా తెలుగుదేశం యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 3 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రాజులకొత్తూరు వద్ద పైలాన్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమానికి లోకేశ్‌తోపాటు ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ, చిన్నల్లుడు భరత్, బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తదితరులు హాజరయ్యారు. లోకేశ్‌కి సంఘీభావం తెలిసిన టీడీపీ ముఖ్యనేతలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో రాజుల కొత్తూరు జనసంద్రాన్ని తరలించింది.