Allahabad High Court: సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పెళ్ళైన ముస్లిం వ్యక్తులు సహజీవనం చేసే హక్కును పొందలేరని పేర్కొంది. పెళ్ళైన ముస్లిం అబ్బాయి సహజీవనం చేసేందుకు ఇస్లాం మతం ఒప్పుకోదని వివరించింది. ఉత్తరప్రదేశ్‌లో స్నేహా దేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్‌ల రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
ఇస్లాం మతాన్ని అనుసరించే వ్యక్తి , ముఖ్యంగా అతని జీవిత భాగస్వామి జీవించి ఉన్నట్లయితే, వారు సహజీవనంలో ఉండరాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ అభిప్రాయపడింది. “ఇస్లామిక్ సిద్ధాంతాలు జీవించి ఉన్న వివాహ సమయంలో లివ్-ఇన్-రిలేషన్‌ను అనుమతించవు . ఇద్దరు వ్యక్తులు అవివాహితులైనప్పటికీ, వారు పెద్దలు కావటంతో వారి జీవితాలను వారి స్వంత మార్గంలో నడిపించినట్లయితే వారి స్థానం భిన్నంగా ఉండవచ్చు, ”అని ధర్మాసనం పేర్కొంది.
ALSO READ: హర్యానాలో బీజేపీ ప్రభుత్వం కులబోతుందా?
ఈ పరిశీలనతో, జస్టిస్ ఎఆర్ మసూది, జస్టిస్ ఎకె శ్రీవాస్తవలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్ లోన్ బహ్రైచ్ జిల్లాకు చెందిన పిటిషనర్లు స్నేహా దేవి, మహ్మద్ షాదాబ్ ఖాన్‌లకు పోలీసు రక్షణ కల్పించడానికి నిరాకరించింది. పిటిషనర్లు వారిద్దరూ సహజీవనం చేస్తునట్లు తెలిపారు. అయితే తమ కుమార్తె స్నేహా దేవిని కిడ్నాప్ చేసి పెళ్లికి ప్రేరేపించినందుకు మహిళ తల్లిదండ్రులు ఖాన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
పిటిషనర్లు తాము పెద్దవాళ్లమని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సహజీవనం చేసేందుకు తమకు స్వేచ్ఛ ఉందని పోలీసు రక్షణ కోరారు. విచారణలో, ఖాన్‌కు అప్పటికే వివాహమైందని (2020లో ఒక ఫరీదా ఖాటూన్‌తో), ఒక కుమార్తె కూడా ఉందని బెంచ్ కనుగొంది. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, సహజీవనం చేసేందుకు అనుమతించే సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా అతనికి పోలీసు రక్షణ కల్పించడానికి నిరాకరించింది. ఇస్లాం మతం అలాంటి సంబంధాన్ని అనుమతించదని, ముఖ్యంగా ప్రస్తుత కేసు పరిస్థితులలో బెంచ్ పేర్కొంది.