గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు సమ్మక్క సారలమ్మల భక్తులు అత్యంత పవిత్రంగా భావించే జంపన్న వాగు గట్లు తెంచుకుని ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం (27-07-2023) ఉదయం కొండాయి, మల్యాల గ్రామాలపై వరద విరుచుకుపడింది. వరద ఉద్ధృతిలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన మజీద్, షరీఫ్, అజ్జు ఉన్నారు. ఉదయం వీరి మృతదేహాలను రెస్క్యూ టీం వెలికి తీశారు. ఏం జరుగుతుందో తెలియని వందలాది మూగజీవాలు కట్టేసిన చోటే ప్రాణాలు వదిలాయి. ఇక జిల్లాలోని వెంకటాపురం మండలం బూరుగుపేటలోనూ వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. మారేడుగొండ చెరువుకు గండిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏజెన్సీ గ్రామాలను భయపెడుతున్న వరదలు
ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంచపల్లి వాసుల కన్నీటిగాథ అంతా ఇంతా కాదు. మోరంచపల్లి 300 ఇళ్లు 700 మంది జనాభా ఉన్న అందమైన పల్లెటూరు. కానీ మోరంచ వాగు సృష్టించిన బీభత్సానికి మోరంచపల్లి ఇప్పుడు మరుభూమిని తలపిస్తోంది. ఊరుకు ఊరు నీట మునిగి ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. గ్రామంలోని ప్రతి ఇల్లు నీట మునిగింది. గ్రామస్తులు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డారు.ఇప్పుడు నీళ్లు వెళ్లిపోవడంతో మోరంచ వాగు సృష్టించిన భయానక పరిస్థితులు అందరి గుండెలను మెలిపెట్టేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ రోడ్డేదో, ఇళ్లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఊరుఊరంతా బురదతో నిండిపోయింది. అన్ని ఇళ్లల్లో ఉన్న వస్తువులన్ని వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. నిన్నటి వరకు పచ్చగా కనిపించిన పంటపొలాల్లో ఇసుక మేటలు వేసి ఎడారిని తలపిస్తోంది. ఇళ్లల్లోని ఫ్యాన్లకు సైతం చెత్త చెదారం పట్టుకుందంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
హృదయ విదారకరంగా మారిన గ్రామాలు
మొన్నటి వరకు పాడి పశువులు, పంట పోలాలతో ఎంతో అందంగా కనిపించిన మోరంచపల్లి ఊరు. ఇవాళ పశువుల కబేళాలతో హృదయ విదారకరంగా మారిపోయింది. ఇళ్ల ముందు కట్టేసిన పశువులు కట్టుమీదనే చనిపోయి ఉండడం అక్కడున్న వారిని కంటతడి పెట్టిస్తోంది. వరద సమయంలో కట్టు తెంచుకుని పోలేక నీళ్ల నుంచి తప్పించుకోలేక పశువులు నరకయాతన అనుభవించి మరీ ప్రాణాలు కోల్పోయాయి. ఇంట్లోని వస్తువులే కాదు ఆధారమైన అన్ని ప్రభుత్వానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు వరదలో కొట్టుకుపోయాయి. కనీసం తినటానికి నాలుగు గింజలు కూడా లేని పరిస్థితి నెలకొంది. ఒకే ఒక్క రాత్రి ఆ గ్రామస్తులను సర్వం కోల్పోయేలా చేసి అనాథలుగా మార్చింది. వరద తగ్గిన తర్వాత ఇళ్లకు వచ్చి చూసుకుంటున్న బాధితుల కన్నీళ్ల భారాన్ని ఏ దేవుడు మోయగలడు.ప్రకృతి సృష్టించిన విధ్వంసం కారణంగా సమస్తం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది.