భద్రాచలం (Badrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం (Seetharamachandra swamy temple) లో నేటి నుంచి ముక్కోటి ఉత్సవాలు (Mukkoti ekadasi) ప్రారంభం కానున్నాయి. ముక్కోటి ఏకాదళి ఉత్సవాలు నేటి నుంచి జనవరి 2 వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. మొదటి పది రోజులు డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 23 వరకు పగలు పత్తు ఉత్సవాలు అంటే పగటి పూట నిర్వహించే ఉత్సవాలు చేపట్టగా..తరువాత పది రోజుల పాటు డిసెంబర్ 23 నుంచి జనవరి 2 వరకకు రాపత్తు ఉత్సవాలు (రాత్రి పూట ఉత్సవాలు) నిర్వహిస్తారు.
ఈ ఉత్సవాల్లో సీతారామచంద్ర స్వామి వారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. పది రోజుల పాటు స్వామి వారు దశావతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. డిసెంబర్ 22 న గోదావరి లో సాయంత్రం నాలుగు గంటలకు సీతారాములకు హంసవాహనం పై తెప్పోత్సవం వేడుక నిర్వహిస్తారు.
డిసెంబర్ 23 వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారు జాము నుంచి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తారు. స్వామి వారి ఉత్సవాలను తిలకించటానికి వచ్చే భక్తుల కోసం ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంలో పాల్గొనే భక్తుల కోసం గత నెల రోజుల నుంచే టికెట్లను ఆన్ లైన్ లో ఉంచారు.
ఆలయ ప్రాంతాల్లోని కార్యాలయాల వద్ద కూడా నేరుగా టికెట్లు విక్రయిస్తున్నారు. ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం 2 లక్షల లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. ఉత్సవాలకు భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకోవాలని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
Also read: చాలా రోజుల తరువాత పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం!