Forbes India Richest List: 2023 ఏడాదికి గానూ ఫోర్బ్స్ భారత్ లోని 100 మంది కుబేరుల లిస్ట్ ను విడుదల చేసింది. ఇందులో ముఖేష్ అంబానీ (Mukesh Ambani) మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో అదానీ (Adani) నిలిచారు. 92 బిలియన్ డాలర్లుతో ముఖేష్ అంబానీ అపర కుబేరుడు అనిపించుకున్నారు. జియో (Jio) ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడగొట్టి, లిస్టింగ్ చేయడం, తన ముగ్గురు సంతానానికి రిలయన్స్ బోర్డులో చోటు కల్పించడం ద్వారా ముఖేష్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా...వారసత్వ ప్రణాళికను కూడా పటిష్టం చేశారని ఫోర్బ్స్ తెలిపింది.
ఇక ఫోర్బ్స్ లిస్ట్‌లో గత ఏడాది గౌతమ్ అదానీ టాప్ వన్ లో ఉన్నారు. ఈ ఏడాది మాత్రం హిడెన్ బర్గ్ ఆరోపణలతో అదానీ సంపద కరిగిపోగా ఆయన రెండో స్థానంలోకి దిగజారిపోయారు. ఈసారి గౌతమ్ అదానీ 68 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు. అదానీ షేర్లు కుదేలు అవడంతో ఆయన సంపద 82 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. ఇక ఫోర్బ్స్ లిస్ట్ లో మూడో స్థానంలో ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీ ఛీఫ్ శివనాడార్ (HCL Founder Shiv Nadar) 29.3 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్నారు. సావిత్రి జిందాల్ 24 బిలియన్ డాలర్ల నికర విలువతో నాలుగవ స్థానంలో ఉన్నారు.రాధాకిషన్ దమాని ఆస్తుల నికర విలువ 23 బిలియన్ డాలర్లు గా ఉంది. ఆయన అయిదవ స్థానంలో ఉంది. సైరస్ పూనావల్ల ఆరవ స్థానంలో 20.7 బిలియన్ డాలర్లు సంపదతో నిలిచారు. ఇక భారతదేశంలోని సంపన్నులలో హిందూజా కుటుంబం 20 బిలియన్ డాలర్లతో ఏడవ స్థానంలో ఉంది. దిలీప్ షాంఘ్వీ 19 బిలియన్ డాలర్ల నికర విలువతో ఎనిమిదవ స్థానంలో ఉండగా, కుమార్ బిర్లా 17.5 బిలియన్ల డాలర్ల నికర విలువతో 9వ స్థానంలో ఉన్నారు. ఇక షాపూర్ మిస్త్రీ అండ్ కుటుంబం 16.9 బిలియన్ డాలర్ల నికర విలువతో పదవ స్థానంలో నిలిచారు.
భారత్ లో 100 మంది కుబేరుల మొత్తం సంపద ఈ ఏడాది 799 బిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ పేర్కొంది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లకు భారత్ మంచి కేంద్రంగా మారుతోందని తెలిపింది. తెలుగువారిలో మురళి దివి 6.3 బిలియన్ డాలర్ల సంపదతో 33వ స్థానంలో ఉన్నారు.