Manda Krishna Madiga: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. దీనిపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేస్తూ..20 ఏళ్ల తమ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు . ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004 నవంబర్ 5న చెప్పానన్నారు. అధర్మం తాతాక్కలిమైనా.. చివరకు ధర్మమే గెలుస్తుందని ఆనాడే చెప్పా అని మందకృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ…. ‘వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. మా 30 ఏళ్ల అలుపెరగని పోరాటానికి విజయం లభించింది. ఈ పోరాటంలో ఎంతో మంది అసువులు బాశారు. వర్గీకరణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. సహనం కోల్పోకుండా పట్టుదలతో పోరాటం చేసి విజయం సాధించాం. 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాం. జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాడాం. న్యాయం కోసం ఎమ్మార్పీఎస్‌కు అండగా నిలబడ్డ వారందరికి ఈ విజయం అంకితం’ అని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై గురువారం సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పునిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యా సంస్థల్లో.. ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని తేల్చి చెప్పింది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో వెనకబడి ఉన్న వారి కోసం ప్రత్యేక కోటా ఇచ్చేందుకు అనుమతి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు 2004లో ఈవీ చిన్నయ్య (EV Chinnaiah) నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పును తిరస్కరించింది. 6:1 మెజారిటీతో చీఫ్ జస్టీస్ డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud) నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ తీర్పు వెలువరించింది.
Also Read:Maharashtra: ఆన్ లైన్ గేమ్ ఎఫెక్ట్..ముందే స్కెచ్ గీసుకుని ప్రాణం తీసుకున్న బాలుడు