MP Venkatesh Netha: పార్టీ నుంచి నేతల ఫిరాయింపులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తాకాయి. తాజాగా పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశించి ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన వెంకటేష్ నేత బీజేపీలో చేరనున్నారు. కాంగ్రెస్ తనకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీ ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి.
సొంతోళ్లే నో అన్నారు...
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వస్తే తనకే ఎంపీ టికెట్ వస్తుందని ఆశగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కు నేత హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చింది. ఎమ్మెల్యే వివేక్ కొడుకు గడ్డం వంశీ కృష్ణకు ఎంపీ టికెట్ ప్రకటించింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్టానానికి దూరంగా ఉన్నారు. తనను బుజ్జగించే పనులు కూడా కాంగ్రెస్ పెద్దలు చేయకపోవడంతో భంగపడ్డ ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు వెంకటేష్. ఆ తరువాత 2019లో బీఆర్ఎస్ లో చేరి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు.. మళ్లీ ఇప్పుడు బీజేపీలో చేరనున్నారు. ఈయన రాజకీయాల్లో రాక ముందు ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేసేవారు.
ALSO READ: మా ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనాలని చూస్తున్నారు.. బిగ్ బాంబ్ పేల్చిన మంత్రి కోమటిరెడ్డి
బీజేపీలో కుంపటి..?
ఇప్పటికే తెలంగాణలోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తాజాగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత బీజేపీ చేరనున్నారు. అయితే.. పెద్దపల్లి ఎంపీ టికెట్ హామీతోనే ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అధిష్టానం కూడా పెద్దపల్లి టికెట్ వెంకటేష్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు వెంకటేష్ నేత చేరికతో బీజేపీ అధిష్టానం ఆయనకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తుందని జరుగుతున్న ప్రచారంలో బీజేపీలో కుంపటి పెట్టినట్లు అయింది. అయితే.. పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలని అమిత్ షా టీమ్ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రచారంలో శ్రీనివాస్ వెనకబడ్డారని హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఒకవేళ వెంకటేష్ కు బీజేపీ టికెట్ కేటాయిస్తే గోమాస శ్రీనివాస్ తదుపరి కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.