MLC Vamsi Krishna Yadav: కొద్ది రోజుల క్రితం వైసీపీ (YCP) ని వీడి జనసేన (Janasena) బాట పట్టిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన విశాఖ జిల్లా అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా వంశీకృష్ణను నియమిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయనకు పవన్ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు.
పార్టీ కార్యక్రమాలను వంశీకృష్ణ మరింత ముందుకు తీసుకుని వెళ్లేందుకు కృషి చేయాలని పవన్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించి ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వారికి జనసేన భావాలను మరింత వివరించాలని ఈ సందర్భంగా వంశీ కృష్ణ కు తెలియజేశారు.
ఈ సందర్భంగా వంశీ కృష్ణ మాట్లాడుతూ.. పవన్ తన భుజాల మీద పెట్టిన బాధ్యతను ఎంతో ఇష్టం గా చేస్తానని వివరించారు. ఆయన నా మీద నిలబెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానీవ్వను అని చెప్పుకొచ్చారు.
వారం రోజుల క్రితం వైసీపీ నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ జనసేన లో చేరారు. ఆయన తన అనుచరులతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకోగా..వారందరికీ కూడా పవన్ జనసేన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఆ సమయంలో పవన్ వంశీ కృష్ణతో ఉన్న అనుబంధం గురించి వివరించారు.
ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా యువరాజ్యం విభాగంలో వంశీ తనతో కలిసి పని చేశారని..ఆ సమయంలో ఆయన ఎంతో చురుకుగా ఉండేవారని అలాంటి వారు ఇప్పుడు జనసేనలోకి రావడం సొంత ఇంటికి రావడం లాంటిదేనన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని రానున్న రోజుల్లో పార్టీకి మరిన్ని చేరికలు ఉంటాయని పవన్ అన్నారు.
Also Read: తెలంగాణలో 26మంది ఐఏఎస్ ల బదిలీలు..