మరో 20 రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ప్రచారాలతో దూకుడు చూపిస్తున్నాయి. ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతుండటంతో.. పోటీలో పాల్గొనే అభ్యర్థులు నామినేషన్ల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే బోధన్‌లోని ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే షకీల్ ఈరోజు నామినేషన్ వేయనున్నారు. అయితే ఆయన పాటు ఎమ్మెల్సీ కవిత కూడా అక్కడికి రానుంది. కానీ కవిత ఆ ప్రాంతానికి చేరుకోగానే ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. మరోవైపు ఎమ్మెల్యే షకీల్ నామినేషన్ వేయాల్సిన సమయం ఆసన్నమవుతోంది. ఇక ట్రాఫిక్‌లో ఉంటే ఆలస్యం అవుతుందని భావించిన కవిత.. కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడున్న తమ పార్టీ అనుచరుని స్కూటీపై వెళ్లి నామినేషన్ ర్యాలీ వద్దకు చేరుకుంది.
This browser does not support the video element.
Also read: ఐటీ అధికారుల నిఘాలో నామినేషన్.. ఈసీకి పొంగులేటి కంప్లైంట్!
అక్కడున్న బీఆర్ఎస్ శ్రేణులు కవిత అలా బైక్‌పై వెళ్లడాన్ని చూసి పొంగిపోయారు. తమ ఫోన్లలో ఆమె బైక్‌పై వెళ్తున్న వీడియోలను తీశారు. ఇదిలా ఉండగా.. నవంబర్ 10 అంటే రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అధికార, ప్రతిపక్ష, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు గజ్వేల్‌లో నామినేషన్ వేశారు. మళ్లీ ఈరోజే కామారెడ్డిలో కూడా నామినేషన్ వేయనున్నారు. అలాగే మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌లు కూడా ఈరోజే నామినేషన్లు వేస్తున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా ఈరోజు హుజురాబాద్‌లో నామినేషన్ వేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పొంగులేటికి నామినేషన్ వేసేందుకు ఐటీ అధికారులు అనుమతి ఇవ్వడంతో.. ఆయన కూడా ఈరోజు నామినేషన్ వేస్తున్నారు.
ఒకరకంగా చూస్తే చాలామంది కీలక నేతలతో పాటు మరికొందరు అభ్యర్థులు ఈరోజు ఎక్కువగా నామినేషన్లు వేస్తున్నారు. దానికి కూడా ఓ కారణం ఉంది. ఈరోజు ఏకాదశి కావడంతో మంచిరోజని భావించి వీళ్లు నామినేషన్లు వేస్తున్నారు. ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు మంచి ముహూర్తం ఉందనే కారణంతో ఈ సమయంలోనే నామినేషన్లను వేసేందుకు మొగ్గు చూపుతున్నారు.