MLC Kavitha: కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ (Telangana) ను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణలు చెప్పలేరా? అని ప్రశ్నించారామె. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు కవిత (Kavitha). తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి కాంగ్రెస్ ముఖ్యనేత పి. చిదంబరం (P Chidambaram) క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్షమాపణలపై స్పందించిన ఆమె.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టారు. పదేళ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం అని అన్నారు. తెలంగాణ గడ్డ మీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ అని నినదించకపోవడం దారుణం అని పేర్కొన్నారు కవిత. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు అమరవీరుల స్థూపం ముందు మోకరిల్లినా.. వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందు మంత్రి కేటీఆర్ (KTR) సైతం చిదంబరం వ్యాఖ్యలపై స్పందించారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది చిదంబరీ జీ అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్.. ఈ విషయంలో క్షమాపణ అనేది చాలా చిన్నదని అన్నారు. 1952 నుంచి 2014 వరకు తెలంగాణ వచ్చే వరకు వందలాది మంది చనిపోవడానికి కారణం కాంగ్రెస్సే అని, యువకుల ఆత్మహత్యకు కాంగ్రెస్‌దే బాధ్యత అని అన్నారు. ఇప్పుడొచ్చి ఎంత కష్టపడినా తెలంగాణ విషయంలో కాంగ్రెస్ చేసిన ద్రోహం, దౌర్జన్యాలను ప్రజలు మర్చిపోరన్నారు.
గురువారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన పి. చిదంబరం.. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలను ప్రస్తావిస్తూ క్షమాపణలు చెప్పారు. అయితే, ఈ బలిదానాలకు కేంద్ర ప్రభుత్వాన్ని నిందించలేమన్నారు. రాష్ట్ర ఏర్పాటు అంత సులవైన విషయం కాదన్న చిదంబరం.. ప్రజా ఉద్యమం ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైందన్నారు. ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Also Read: