Bail Granted For MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ( Delhi Liquor Scam) ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. దాదాపు 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న ఆమెకు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరైంది. దీంతో కవిత విడుదల కానున్నారు. కవిత తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా.. ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ SV రాజు వాదనలు వాదించారు. వీరి మధ్య దాదాపు గంటన్నర పాటు హోరాహోరీగా వాదనలు సాగాయి. అయితే, రోహత్గీ వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో 161 రోజుల తర్వాత కవిత జైలు నుంచి బయటకు రానున్నారు. దీంతో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
విచారణలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని ముకుల్ రోహత్గీ తన వాదనల్లో పేర్కొన్నారు. కవిత 5 నెలలుగా ఈడీ, 4నెలలుగా సీబీఐ రిమాండ్‌లో ఉందన్నారు. సౌత్ లాబీ వాటా రూ. 100కోట్లు అన్నారని.. కానీ, దర్యాప్తు సంస్థలు రూపాయి కూడా రికవరీ చేయలేదన్నారు. సిసోడియాకు ఇచ్చినట్లే కవితకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ అయిన కవిత ఎక్కడికి పారిపోరన్నారు. కవిత తండ్రి మాజీ సీఎం అని, సోదరుడు మాజీమంత్రి అని కూడా న్యాయస్థానానికి తెలిపారు. ఇది తప్పుడు కేసని వాదించారు.
ఈడీ తరఫున SV రాజు వాదనలు వినిపిస్తూ.. కవిత విచారణకు సహకరించలేదన్నారు. ఈడీ నోటీస్ రాగానే ఫోన్లను ధ్వంసం చేసి, ఫార్మట్ చేశారన్నారు. ఫార్మట్ చేసిన ఫోన్లను ఇంట్లో పనివాళ్లకు ఇచ్చారన్నారు. ఆధారాలను ధ్వంసం చేసిన కవితకు ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం సరికాదన్నారు. అయితే.. కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమెకు బెయిల్ ఇచ్చింది.