MLA Prasanna Kumar : తిరుమల అలిపిరి దారిలో చిన్నారి లక్షిత మృతి పై నెల్లూరు జిల్లా కోవూరు వైసీసీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చిన్నారి మృతి వెనుక తల్లిదండ్రుల మీద అనుమానం ఉందంటూ పేర్కొన్నారు. బాలిక తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించాలని ఆయన అన్నారు.
సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించినట్లయితే..పాప మొదటిసారి తప్పిపోయిన సందర్భంలో అక్కడ మజ్జిగ అమ్మేవారు పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీ టీవీ లో క్లిప్పింగులను పరిశీలిస్తే పాప చాలా సార్లు ఒంటిరిగానే తిరుగుతూ కనిపించింది. ఈ క్రమంలోనే ప్రసన్న కుమార్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఆయన ఓ వీడియో విడుదల చేశారు. '' ఈ ఘటన గురించి టీటీడీ ఛైర్మన్ భూమనతో మాట్లాడాను. ఘటన పై విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. నెల్లూరుకు చెందిన కుటుంబానికి ఇలా జరగడం విచారకరం.. అయితే, ఇద్దరు ఆడపిల్లలు కావడం, కుటుంబంలో గొడవలు ఉన్నాయి. అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిమీద తల్లిదండ్రులను కూడా పోలీసులు విచారించాలి’ అన్నారు.
మరోవైపు, చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. లక్షిత మృతదేహం నెల్లూరుకు తరలించారు. చిన్నారిని చిరుతే చంపిందని ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా చిరుతే దాడి చేసి చంపిందని ఆధారాలు సేకరించారు. ఈ రోజు సాయంత్రం లక్షితకు అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.
అసలేం జరిగిందంటే!
నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన దినేశ్ కుటుంబం తిరుమల వచ్చారు. అలిపిరి నడకదారి మార్గంలో తిరుమలకు స్టార్ట్ అయ్యారు. నడుచుకుంటూ వెళ్తుండగా.. సడన్‌గా పాప లక్షిత తమతో లేదన్న విషయాన్ని కుటుంబసభ్యులు గమనించారు. లక్షిత ఎక్కడో తప్పిపోయి ఉంటుందని అంతా భావించారు.
వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా మిస్సింగ్ కేసే అనుకున్నారు. తల్లిదండ్రులు కూడా పాప కనిపించలేదనే అనుకున్నారు కానీ చిరుత దాడి చేస్తుందని అసలు ఊహించలేకపోయారు. లక్షిత కోసం గాలించడం మొదలుపెట్టిన టీటీడీ అటవీ శాఖ, విజిలెన్స్, పోలీసులకు నరసింహస్వామి ఆలయం వద్ద లక్షిత మృతదేహం కనిపించింది.
Also Read: చిరుతనా? ఎలుగుబంటినా? లక్షిత మరణానికి కారణం ఏంటి?