BRS MLA Candidate Niveditha: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు షాక్ తగిలింది. నివేదిత ఇంటి ఎదుట డబుల్ బెడ్ రూమ్ బాధితులు ఆందోళనకు దిగారు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి తమ వద్ద రూ.1.40 కోట్లు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న, ఆయన ఇద్దరు కూతుర్ల సమక్షంలో ఈ డబ్బు మొత్తాన్ని ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.
సాయన్న మరణం అనంతరం ఆ డబ్బును అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని లాస్య నందిత తమకు హామీ ఇచ్చిందని వారు పేర్కొన్నారు. ఆమె ఎమ్మెల్యే అయ్యాక తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని.. తమ డబ్బు తమకు ఇవ్వాలని అని అడిగితే ఇస్తామని చెప్పారని.. లాస్య నందిత మృతి తరువాత తమ ఫోన్లు ఎత్తడం లేదని.. తమ కాల్స్ బ్లాక్ చేశారని బాధితులు నివేదిత ఇంటి ముందు ధర్నాకు దిగారు. తమ వద్ద తీసుకున్న డబ్బులు వెంటనే తమకు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి దివంగత ఎమ్మెల్యే సాయన్న పెద్ద కూతురు నందితకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.