National: విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. లావోస్, కంబోడియాలో ఉద్యోగాలకోసం వెళ్లేవారు ఫేక్ కంపెనీపట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఫేక్ ఏజెంట్స్ నమ్మి నష్టపోవదద్దని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది.
ఈ రెండు దేశాల్లో లాభదాయకమైన ఉపాధి అవకాశాలను అందిస్తున్నట్లు నకిలీ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. ఈ స్కామ్‌ల్లో సైబర్ నేరాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణా, దోపిడీ, మోసం, వివిధ ప్రమాదాలుండే అవకాశం ఉందని హెచ్చరించింది. 'నకిలీ ఏజెంట్లు ఉపాధి కోసం ప్రజలను మభ్యపెడుతున్నారు. కంబోడియా, ఆగ్నేయాసియా ప్రాంతంలకు ఉద్యోగాల కోసం ప్రయాణిస్తున్న భారతీయ పౌరులందరు ఈ ప్రాంతంలో చాలా మంది నకిలీ ఏజెంట్లు పనిచేస్తున్నారని తెలియజేస్తున్నాం. వారు భారతదేశంలోని ఫేక్ ఏజెంట్లతో పాటు, ముఖ్యంగా సైబర్ నేరాలకు పాల్పడే స్కామ్ కంపెనీలతో సంబంధాలు కలిగివున్నారు. ప్రజలకు డబ్బు పేరుతో ఆకర్షించి నట్టేటా ముంచేస్తున్నారు' అంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
కంబోడియాలో ఉద్యోగం కోసం వెళ్లేవారు ఎవరైనా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమోదించిన అధీకృత ఏజెంట్ల ద్వారా మాత్రమే వెళ్లాలి. ఈ మోసపూరిత పద్ధతుల ద్వారా ప్రజలను ఆకర్షించిన సందర్భాలు ఇప్పటికే బయటపడ్డాయి. లావోస్‌లోని గోల్డెన్ ట్రయాంగిల్ స్పెషల్ ఎకనామిక్ జోన్‌లో కాల్-సెంటర్ స్కామ్‌లు, క్రిప్టో-కరెన్సీ మోసాలను నిర్వహిస్తున్న అనుమానాస్పద సంస్థల ద్వారా 'డిజిటల్ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు' లేదా 'కస్టమర్ సపోర్ట్ సర్వీస్' వంటి ఉద్యోగాల కోసం మోసపూరిత ఉపాధి అవకాశాలు ప్రచారం చేయబడుతున్నాయి. ఈ కంపెనీలకు దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, భారతదేశంతో సహా వివిధ ప్రదేశాలలో ఏజెంట్లు ఉన్నారు. వీరు భారతీయ పౌరులను చురుకుగా రిక్రూట్ చేస్తున్నారని మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.