Minister Roja: తిరుపతి జిల్లా వడమాల పేట మండలం అప్పలయగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఆర్ కే రోజా. జగనన్న సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని, 2024 లో సీఎంగా తిరిగి బాధ్యతలు చేపట్టాలని 108 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. అంతేకాదు జగన్ బర్త్ డే సందర్భంగా ఆమె ఒక పేద కుటుంబానికి అండగా నిలిచారు.
క్రిస్మస్ తాత వేషంలో రెడీ అయి ఓ నిరుపేద కుటుంబాన్ని సర్ ప్రైజ్ చేశారు మంత్రి రోజా. ఆ కుటుంబంలో ఓ భార్య, భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భార్యకు ఒక కిడ్నిఫేల్ అయింది. అనారోగ్యం పరిస్థితిలో ఉన్న భార్యను చూసుకుంటూ ఇంట్లోనే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు భర్త నాగరాజు. వీరి పరిస్థితిపై సమాచారం అందుకున్న రోజా క్రిస్మస్ తాత వేషంతో ఇంటికి వెళ్లి ఆశ్చర్య పరిచారు. ఇంట్లో ఉన్న ఇద్దరి పిల్లలకు గిఫ్ట్స్ తీసుకుని వెళ్లారు. ఆమెను చూసిన కుటుంబ సభ్యులు ఎంతో సంతోష పడ్డారు. వారి సమస్యలు పూర్తిగా తెలుసుకున్న రోజా వారికి అండగా నిలిచారు. భర్త నాగరాజుకు షాప్ పెట్టుకోవడానికి కావాల్సినంత సహయం చేస్తానని హామీ ఇచ్చారు.
అంతేకాకుండా వైసీపీ శ్రేణులు నిర్వహించిన బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి రోజా. బైక్ నడుపుతూ జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైక్ రైడ్ చేశారు. అనంతరం టీడీపీ అధినేతపై మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీ విస్మరించి, మ్యానిఫెస్టో పార్టీ వెబ్ సైట్ నుంచి తొలగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. యువగళం ముగింపు సభలో కనీసం నందమూరి తారకరత్న ప్రస్తావన తీసుకురాలేదని మండిపడ్డారు. నందమూరి కుటుంబాన్ని కేవలం చంద్రబాబు అవసరాలకే వాడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ఒక ఐరన్ లెగ్ అని, లోకేష్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దెవ చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను, జనసైనికులను చూస్తే జాలి వేస్తుందని కామెంట్స్ చేశారు.