AP News: అన్నమయ్య జిల్లా వాల్మికిపురం మండలం చింతపర్తి పంచాయతీ BC కాలనీకి చెందిన కువైట్ బాధితుడు శివకు మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లిన శివను ఎడారిలో పశువులు, కోళ్లు, బాతుల కావాలి ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి కన్నీరుమున్నీరయ్యాడు. తనను ఆదుకుని ఇంటికి రప్పించాలని అధికారులను వేడుకున్నాడు. దీంతో వెంటనే స్పందించిన లోకేష్ శివను తన స్వంత గ్రామానికి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఎడారి ప్రాంతంలో ఎవ్వరూ లేని చోట..
ఈ మేరకు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన రామచంద్రరావు కుమారుడు శివ18ఏళ్ల క్రితం చింతపర్తికి చెందిన శంకరమ్మను వివాహం చేసుకొని అక్కడ కిరాయి ఇంట్లో కాపురం ఉన్నాడు. అతనికి వెన్నెల (16), వనిత(11) ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఇద్దరమ్మాయిలను పోషించి పెళ్లి చేయాలని ఆశతో రాయచోటికి చెందిన ఓ ఎజెంటు మాయమాటలు నమ్మి కువైట్ వెళ్ళాడు. అక్కడ ఎడారి ప్రాంతంలో ఎవ్వరూ లేని చోట పని కల్పించడంతో సమయానికి తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ,అక్కడినుండి తను పడుతున్న కష్టాలు బాధలు వీడియో ద్వారా షోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం విద్యా, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కు చేరడంతో వెంటనే స్పందించి NRIలకు సమాచారం అందించారు. అతనిని తన స్వంత గ్రామానికి రప్పించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. బాధితుడు శివకు అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పడంతోశివ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.