కరెంట్ కావాలా.. కాంగ్రెస్‌ కావాలా..?: కేటీఆర్‌

కేసీఆర్‌ వల్లే ఢిల్లీ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. 14 ఏళ్లుగా నవంబర్‌ 29 దీక్షా దివాస్‌ జరుపుకుంటున్నామని.. నవంబర్‌ 29 తెలంగాణ జాతిని ఏకం చేసిందని పేర్కొన్నారు. ఆ రోజున తెలంగాణ ప్రజలు దీక్షా దివాస్‌ను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

New Update
కరెంట్ కావాలా.. కాంగ్రెస్‌ కావాలా..?: కేటీఆర్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార, విపక్ష నేతలు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ వల్లే ఢిల్లీ దిగొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. కేసీఆర్‌ శపథం చేసి మరి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. 14 ఏళ్లుగా నవంబర్‌ 29 దీక్షా దివాస్‌ జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. నవంబర్‌ 29 తెలంగాణ జాతిని ఏకం చేసిందని.. అదే రోజు మహోద్యమానికి బీజం పడిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలందరూ నవంబర్‌ 29న దీక్షా దివాస్‌ను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

రేవంత్‌ రెడ్డికి బీజేపీని ఎదిరించే దమ్ము లేదని కేటీఆర్ ఆరోపించారు. బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్, రాజాసింగ్‌ను ఓడిస్తామని ధీమావ్యక్తం చేశారు. బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్‌కే ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చాక లక్ష 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలు పదివేలు కూడా దాటలేవని ఆరోపించారు. రాహుల్‌గాంధీ గానీ, రేవంత్ రెడ్డి గాని ఇంతవరకు ఒక్క పరీక్ష అయినా రాసి ఉద్యోగం చేశారా అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని.. అక్కడ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడిచిన కూడా ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదంటూ విమర్శించారు. రైతుల పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని.. రైతు బంధు ఆపేయాలని ఉత్తమ్‌కుమార్‌కు సీఈసీకి ఫిర్యాదు చేశారని ఆరోపించారు. కరెంటు కావాలో.. కాంగ్రెస్ కావాలో తెలంగాణ ప్రజలే తేల్చుకోవాలని అన్నారు.

Also Read: ఎన్నికల వేళ.. 24 గంటల్లో రూ.14 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

Advertisment
Advertisment
తాజా కథనాలు