BJP Game Plan in AP: దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీని ఏలిన మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో మాత్రం తనదైన మార్క్ చూపించడంలో విఫలమయ్యారనే చెప్పాలి. 2008లో సామాజిక న్యాయం నినాదంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి.. తొలి ఎన్నికల్లోనే 18సీట్లు గెలుచుకున్న చిరు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. వైఎస్ మరణం, రాష్ట్ర విభజన అంశం, జగన్ తిరుగుబాటుతో ఎమ్మెల్యేలను కోల్పోయిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చిరంజీవి ఇచ్చిన 18మంది ఎమ్మెల్యేలతోనే అవిశాస్వం నుంచి గట్టెక్కింది. కాంగ్రెస్‌తో విలీనం తర్వాత ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని పొందారు. కేంద్ర పర్యాటక మంత్రిగా స్వతంత్ర హోదాలో విధులు నిర్వర్తించారు. ఇక సడన్‌గా 2014 తర్వాత ఆయన యాక్టివ్ పాలిటిక్స్ నుంచి సైలెంట్‌గా సైడైపోయారు. తర్వాత హీరోగా రీఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయనకు కేంద్రం దేశంలోని రెండో అతిపెద్ద పురస్కారమైన పద్మవిభూషన్ ను ప్రకటించింది. ఈ అవార్డు ఆయనకు వరించడం పట్ల సినీ లోకంతో పాటు ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో చిరు గురించి మరో వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రాజ్యసభకు మరోసారి చిరంజీవి వెళ్తారన్న ప్రచారం జోరందుకుంది. దీనికి అనేక బలమైన కారణాలు వినిపిస్తున్నారు విశ్లేషకులు.
కళా రంగంలో..
ఈ మేరకు కళా రంగంలో చిరంజీవిని రాజ్యసభ కు నామినేట్ చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల ముందు మెగాస్టార్ ను నామినేట్ చేస్తే ఏపీలో కాపూ ఓట్లతో పాటు ఫ్యాన్స్ ఓట్లు కొల్లగొట్టోచ్చు అనే యోచనలో కమలనాథులున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే రాజ్యసభ నామినేట్ పోస్టుల్లో మొత్తం 12 స్థానాలు ఉండగా ప్రస్తుతం అందులో మూడు ఖాళీలు ఉన్నాయి.
కాపు ఓటు బ్యాంక్ కోసమేనా?
ప్రస్తుతం చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత 'లెఫ్ట్' నుంచి 'రైట్'కు మారారు పవన్. అప్పటినుంచి బీజేపీతోనే ఉన్న పవన్ గతేడాది స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీకి మద్దతు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు టీడీపీతో కలిసి వెళ్లలా లేదా అన్నదానిపై బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు చంద్రబాబు ఇటు పవన్ ఢిల్లీ బీజేపీ పెద్దలతో పలుమార్లు భేటీ అయినా ఈ ట్రైయాంగిల్ పొత్తు ఫైనల్ కాలేదు. ఇదే సమయంలో మండపేటలో ఎమ్మెల్యే అభ్యర్థిని టీడీపీ ప్రకటించడాన్ని పవన్ తప్పుబట్టారు . ఓవైపు ఈ ఎపిసోడ్ జరుగుతుండగానే చిరంజీవికి పద్మవిభూషన్ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అటు యూపీ నుంచి రాజ్యసభకు చిరును పంపిస్తారన్న ప్రచారమూ సాగుతోంది. ఇదంతా కాపుల ఓట్ల కోసమేనంటున్నారు విశ్లేషకులు.
కాపుల ఓట్లే ఎందుకు?
ఏపీలో ఓట్ల పరంగా అతిపెద్ద జనాభా ఉన్న కులం కాపు. గత 2019 ఎన్నికల్లోనూ జగన్ విజయంలో కాపు ఓట్లు కీలక పాత్ర పోషించాయి. వైసీపీ 32మంది కాపు అభ్యర్థులను నిలబెడితే అందులో 30మంది అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మంత్రివర్గంలోనూ కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు జగన్. ఇలా కాపుల చుట్టే కొంతకాలంగా ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ కులాన్ని బలంగా చేసుకుంటే భవిష్యత్‌లో ఏపీలో తమ పార్టీ ఎదుగుదలకు గట్టి పునాదులు పడినట్టేనని బీజేపీ భావిస్తుందానన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చిరుతో మచ్చిక చేసుకుంటే కాపుల ఓట్ బ్యాంక్‌తో పాటు ఇతర కులాల ఓట్లు కూడా తమవైపునకు తిప్పుకోవచ్చని బీజేపీ ప్లాన్ కావొచ్చు. బీజేపీ ఏం చేసినా లాంగ్ టర్మ్‌ను దృష్టిలో పెట్టుకోనే చేస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లోనూ అలానే అంచెలంచెలుగా ఎదిగింది. ఏపీలోనూ ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని కమలనాథులు ప్రణాళిక రచించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఆరు గ్యారంటీల అమలు
WATCH: