/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Mega-family-vs-Allu-Arjun.jpg)
Mega Family vs Allu Arjun: ఏపీలో ఎన్నికలు ముగిశాయి. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన సంఘటనలకు కౌంటర్లు మొదలయ్యాయి. ఏపీ ఎన్నికల ప్రచారంలో అత్యంత సంచలనం సృష్టించిన సంఘటన అల్లు అర్జున్ నంద్యాల పర్యటన. సరిగ్గా ప్రచార పర్వం ముగియడానికి కొద్ది గంటల సమయం ఉందనగా అల్లు అర్జున్ సతీ సమేతంగా నంద్యాల వెళ్లారు. అక్కడ వైసీపీ తరఫున పోటీలో ఉన్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ఆయనకు మద్దతు ఇస్తూ మాట్లాడారు. అంతే.. ఇంకేముంది.. జనసేనలో కలకలం రేగింది. మెగా కాంపౌండ్ నుంచి టాప్ పొజిషన్ లో ఉన్న హీరో.. వైసీపీకి మద్దతుగా మాట్లాడటం ఏమిటంటూ అందరూ అల్లు అర్జున్ పై కారాలు మిరియాలు నూరారు. అయితే, వాటన్నిటినీ అల్లు అర్జున్ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. సోషల్ మీడియాలో జనసేన సపోర్టర్లు.. పవన్ అభిమానులు అల్లు అర్జున్ ను ట్రోల్ చేశారు. అయితే, జనసేన ముఖ్యనేతలు ఎవరూ అప్పుడు ఈ విషయంపై ఏమీ నోరుమెదపలేదు. దీంతో దానిని మర్చిపోయినట్టు కనిపించింది.
Also Read: ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా అల్లు అర్జున్
Mega Family vs Allu Arjun: కానీ, సరిగ్గా పోలింగ్ ముగిసిన వెంటనే.. రాత్రి 10 గంటల సమయంలో మెగా బ్రదర్ నాగబాబు ఒక చిన్న పోస్ట్ Xలో చేశారు. “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...!” అంటూ ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. మెగా అభిమానులే కాకుండా అందరూ చర్చించుకునేలా ఈ ట్వీట్ ట్రెండ్ అవుతోంది. ఈ ట్వీట్ పరోక్షంగా అల్లు అర్జున్ పై విమర్శలు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు అంటూ చేసిన విమర్శ కచ్చితంగా బన్నీని ఉద్దేశించి చేసిందే అని మెగా అభిమానులు అంటుకుంటున్నారు. ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు వార్ గా సోషల్ మీడియాలో అభిమానులు చీలిపోయి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు దానికి మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ ఆజ్యం పోసినట్టయింది. నాగబాబు చేసిన ట్వీట్ ఇక్కడ మీరూ చూడొచ్చు.
మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే,
మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే...!— Naga Babu Konidela (@NagaBabuOffl) May 13, 2024
Mega Family vs Allu Arjun: ఈ ఒక్క ట్వీట్ తో నాగబాబు ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతున్న మెగాఫ్యామిలీతో అల్లు అర్జున్ కు చెడింది అనే వార్తలు నిజమే నాని స్పష్టం అయింది. ఎవరికైనా ఈ విషయంలో ఏదైనా అనుమానాలు ఉన్నా.. అవన్నీ నాగబాబు ట్వీట్ తో పటాపంచలు అయిపోయాయి. మొత్తం మీద నాగబాబు ఘాటు ట్వీట్ ఇప్పుడు మెగా అభిమానుల మధ్యలో పెద్ద చర్చ రేపింది. పవన్ అభిమానులు అల్లు అర్జున్ విషయంలో లైట్ తీసుకుంటారో.. నాగబాబు ట్వీట్ తో మరింత రెచ్చిపోతారో ఇకపై చూడాలి.